గోదావరిఖని, మార్చి 9 : అడ్రియాల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వీటీసీ ట్రైనీ కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖానలో కుటుంబసభ్యులు, కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మార్చురీలో ఉన్న శ్రీకాంత్ మృతదేహాన్ని అప్పటివరకు తీసుకెళ్లేది లేదని భీష్మించారు. పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని తరలించే క్రమంలో కుటుంబసభ్యులు, పెద్దసంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు దవాఖాన ఎదుట బైఠాయించారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కార్మిక సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో సింగరేణి అధికారులు చర్చలకు అంగీకరించారు. ఒకవైపు చర్చలు సాగుతున్నా మరోవైపు ధర్నా కొనసాగింది. దీంతో పోలీసులు వారిని వారించి న్యాయం చేస్తామని చెప్పడంతో శాంతించారు. ఇదిలా ఉంటే ప్రమాదంలో మృతి చెందిన జయనాజ్, చైతన్య తేజను మంగళవారం రాత్రి సింగరేణి దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించారు. అధికారులకు సంబంధించిన క్లెయిమ్లు పూర్తి చేస్తామని యాజమాన్యం పేర్కొంది.