తెలంగాణలో పని కల్పించడంలో నిర్మల్‌కు మొదటి స్థానం
నిర్మల్ టౌన్, మార్చి 9 : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై కొత్త సాఫ్ట్వేర్ విధానం తీసుకొచ్చి వేసవి భత్యాన్ని తగ్గించినా జిల్లాలో ఉపాధి హామీ కల్పనలో మాత్రం నిర్మల్‌కు మొదటి స్థానం దక్కింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డు పొందిన ప్రతి కూలీకి పని కల్పించాలనే లక్ష్యంతో పనులు నిర్వహిస్తుండగా.. కూలీల హాజరుశాతంలో నిర్మల్ జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానం రావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 19 మండలాలుండగా.. 396 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్లో 150 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. జిల్లాలో 1,69,175 జాబ్‌కార్డులుండగా.. 3,54,496 కూలీలు పనులు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వారం రోజుల నుంచి కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారం క్రితం పదివేల మంది మాత్రమే పనుల కోసం రాగా.. బుధవారం వరకు 18,500 మంది వరకు వచ్చారు. నిర్మల్‌కు మొదటి స్థానం రాగా.. రెండో స్థానంలో కరీంనగర్ జిల్లా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మట్టితీత పనులు, కందకాల తవ్వకం, హరితహారంలో మొక్కల సంరక్షణ వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవిభత్యం కింద 20 నుంచి 30 శాతం అదనపు కూలీ చెల్లిస్తుండగా.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్ వల్ల వేసవి భత్యానికి కోత విధించినా కూలీలు ఏమి పట్టించుకోకుండా పనులకు వస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
ఉపాధి హామీ ద్వారా కూలీలకు పని కల్పించడంలో నిర్మల్ జిల్లా మొదటిస్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసీజన్లో జాబ్‌కార్డు పొందిన ప్రతి కూలీకి పని కల్పించాలనే లక్ష్యంతో జిల్లాలో పనుల ఎంపిక నిర్వహించి ప్రతి రోజూ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ పనులు ముగియడంతో కూలీలు ఉపాధి హామీ పనులకు పెద్దఎత్తున వస్తున్నారు. వారికి అడిగిన వెంటనే పని కల్పించేందుకు చేపట్టిన చర్యల వల్లే నిర్మల్ జిల్లాకు మొదటిస్థానం దక్కింది.
–విజయలక్ష్మి, డీఆర్డీవో, నిర్మల్