రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక రకాలుగా చేయూతనిస్తున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు గాను ఆయా గ్రామైక్య సంఘాలకు వరి ధాన్యం కొనుగోళ్ల నిర్వహణను అప్పగించింది. నిర్మల్ జిల్లాలోని గ్రామీణ మండలాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. సర్కారు గతేడాది వానకాలం, యాసంగి సీజన్లలలో కొనుగోళ్లకు సంబంధించి కమీషన్ డబ్బు జమచేసింది. ధాన్యం సేకరణ చేస్తూ ఆర్థికంగా ముందుకుసాగుతున్నగ్రామైక్య సంఘాలపై ప్రత్యేక కథనం..
– నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 19
నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్, కుంటాల, మామడ, కడెం, ఖానాపూర్, లక్ష్మణచాంద, సోన్, నిర్మల్‌లో వరిసాగు అధికంగా ఉం టుంది. ప్రభుత్వం ఈ గ్రామీణ మండలాల్లో మహిళా గ్రామైక్య సంఘాలకు కొనుగోలు కేం ద్రాల బాధ్యతను అప్పగించింది. కాగా, మహిళలు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించి, కొనుగోలు చేస్తారు. ఆ ధాన్యానిన కేటాయించిన కేంద్రాలకు తరలించే బాధ్యత మొత్తం వారే నిర్వహిస్తారు. అందుకు ప్రభుత్వం రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించి నేరుగా తమ ఖాతాల్లోనే డబ్బు జమచేస్తుంది. 2021 వానకాలం సీజన్లో 30 గ్రామైక్య మహిళా సంఘాలు 77,379.20 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాయి. అందుకు రూ.24,68,556 కమీషన్ వచ్చింది. అందులో ఖర్చులు పోను రూ.24,45,039 గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమ అయ్యింది. అలాగే యాసంగి సీజన్లో 32 మహిళా గ్రామైక్య సంఘాలు 2,57,241.20 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాయి. అందుకు కమీషన్‌గా రూ.82,26,931 వచ్చింది. అందులో ఖర్చులు పోను రూ.81,97,604 లాభం వచ్చింది. ఇందులో ఇటీవల ప్రభుత్వం రూ.57,38,323 విడుదల చేసింది. ఇంకా రూ.24,59,281 జమ చేయాల్సి ఉంది. జిల్లాలో మహిళా సంఘాలు వరి ధాన్యం సేకరించేందుకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకీ, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం రాజేశ్వర్, డీఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనతో ప్రోత్సహిస్తున్నారు.
మహిళాల సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామైక్య సంఘాలకు బాధ్యతలు అప్పగించింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మేలు రకమైన వరిధాన్యం తీసుకుంటున్నాం. కమీషన్ డబ్బులను ప్రభుత్వం నేరుగా గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమచేస్తున్నది. గ్రామైక్య సంఘాల బలోపేతానికి దోహదపడుతున్నది.
– భాగ్యలక్ష్మి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, బుట్టాపూర్
రైతులు తమ ధాన్యం సకాలంలో విక్రయించేందుకు ఆయా గ్రామాల్లో అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ధాన్యం సేకరణ బాధ్యతలను వారికి అప్పగించింది. వారు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కమీషన్ డబ్బులను గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమ చేసింది. అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహం ఉంది. ఈ ఏడాది వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సాధికారిత సాధించేందుకు ఎంతో ఉపకరిస్తుంది.
– కే విజయలక్ష్మి, డీఆర్డీవో, నిర్మల్ జిల్లా