బాసర, నవంబర్ 12 : యువకులే భవిష్యత్ బాటసారులని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా పార్థసారథికి ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఏఎస్పీ కిరణ్‌కారే ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ట్రిపుల్‌ఐటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈకో పార్కును ప్రారంభించారు. మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో విద్యార్థులతో మాట్లాడారు.
తమ లక్ష్యాన్ని ఛేదించేందుకు నిత్యం కష్టపడాలని పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్ విద్య అంతా అప్లికేషన్ ఓరియంటెడ్‌గా ఉంటుందని, తరగతి గదిలో నేర్చుకున్న అంశాలపై తప్పనిసరిగా ప్రాక్టికల్‌గా పట్టు సాధించాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులు లేబొరేటరీలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నారు. దీంతో సబ్జెక్టుపై సులువుగా పట్టు సాధించవచ్చని తెలిపారు. దీంతో పాటు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌కు తప్పనిసరి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
కొందరు విద్యార్థులకు సబ్జెక్ట్ ఎంత తెలిసినా ఉద్యోగం రాలేందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారని, కమ్యూనికేషన్ అనే లక్ష్య సాధనలో ప్రత్యేక పాత్ర వహిస్తుందని వివరించారు. అలాగే ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని సూచించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. తరగతి గదుల నిర్వహణకే కాకుండా విద్యార్థులు ప్రాక్టిస్ పరిజ్ఞానానికి చేరువ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హెమంత్ బోర్కడే, ట్రిపుల్ ఐటీ సిబ్బంది, ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంత్సరాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని ఎన్నికల కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనుకు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి, అశీర్వచనాలు అందజేశారు. ఈయన వెంట ఈవో విజయరామరావు, తదితరులున్నారు.