గోదావరిఖని, నవంబర్ 11 : ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ను మళ్లీ జాతికి అంకితం పేరుతో రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు వ్యక్తమవతున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని వస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం వేయడం, కార్మికుల ఆదాయ పన్ను రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేసి ఎనిమిదేళ్లు గడిచినా పట్టించుకోకపోవడం, రిటైర్డు కార్మికుల పెన్షన్‌లో ఏళ్ల కాలంగా ఎలాంటి పురోగతి లేకుండా పోవడం వంటి కారణాలతో మోదీపై కార్మికలోకం గుర్రుగా ఉన్నది. సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తుంటే 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
దీంతో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మోదీపై విమర్శనాస్ర్తాలకు దిగుతున్నారు. ఇప్పటికే ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినాదాలతో ప్రతి రోజూ హోరెత్తిస్తున్నారు. సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూలు ఏకమై నల్లబ్యాడ్జీలతో నిరసన, బైకు ర్యాలీలు తీస్తూ తమ నిరసన తెలియజేస్తుంటే.. జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ విప్లవ కార్మిక సంఘాలైన ఇప్టూ, ఏఐఎఫ్టీయూ సంఘాలను కలుపుకొని అందోళనలకు దిగుతున్నది. మోదీ వైఫల్యాలను ఎండగడుతూ మరో వైపు పౌరహక్కు సంఘం నాయకులు, న్యాయవాధులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ప్రధాని వ్యవహారశైలిపై ఆయన సింగరేణి కార్మికులకు చేస్తోన్న అన్యాయంపై టీబీజీకేఎస్ అందోళనలు ఉధృతం చేస్తోంది. నల్లబ్యాడ్జీల ద్వారా నిరసన, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కల్పన, తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు, సొంతింటి కలను సాకారం చేసే క్రమంలో కార్మికులు బ్యాంకుల నుంచి తీసుకునే రూ.10 లక్షల రుణానికి వడ్డీని సింగరేణి నుంచి చెల్లించడంతో పాటు కార్మికులు నివసించే క్వార్టర్లో ఏసీ సౌకర్యం, క్వార్టర్లలో నివసిస్తున్న కార్మికుల నుంచి రికవరీ చేస్తోన్న 1శాతం విద్యుత్ బిల్లులను మాఫీ చేయడం వంటి అనేక పనులు సీఎం కేసీఆర్ చేస్తున్నారని కొనియాడుతున్నారు. సింగరేణి కార్మికులకు ఇన్‌కంటాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014లోనే రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదని, వేతన ఒప్పందాల్లో బొగ్గు గని కార్మికులకు ప్రతిసారీ అన్యాయమే జరుగుతోందని, ఈసారి 11వ వేతన ఒప్పందంలో ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీఎంవో నుంచి ఎలాంటి ఆహ్వానం లేకుండా కేవలం ఎరువుల మంత్రిత్వ శాఖ నుంచి మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించడంపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు
ప్రధాని పర్యటనకు నిరసనగా ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినాదాలతో గోదావరిఖని పట్టణం శుక్రవారం మార్మోగింది. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తా నుంచి నిర్వహిచిన భారీ బైక్ ర్యాలీలో యూనియన్ అగ్రనేతలు మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య పాల్గొన్నారు. చౌరస్తా నుంచి ఫైవింక్లయిన్, విఠల్‌నగర్, తిలక్‌నగర్, కల్యాణ్‌నగర్, రమేశ్‌నగర్ మీదుగా టీబీజీకేఎస్ కార్యాలయానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఖని చౌరస్తా నుంచి ర్యాలీ సాగింది. ఇందులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడారు.
గోలేటి లో మోదీ దిష్టిబొమ్మ దహనం
రెబ్బెన, నవంబర్ 11 : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగె ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రవీందర్, గోలేటి బ్రాంచ్ కార్యదర్శి అశోక్, సహాయ కార్యదర్శి కొయ్యాడ సాగర్‌గౌడ్, నాయకులు శంకర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ సేవపైనే మోదీ దేశభక్తి..
బెల్లంపల్లి, నవంబర్ 11 : ప్రధాని మోదీ దేశభక్తి అంతా కార్పొరేట్‌కు సేవచేసేందుకేనన్న విషయాన్ని ఆయన అవలంభిస్తున్న ప్రైవేటీకరణ, రైతు వ్యతిరేక విధానాలే స్పష్టం చేస్తున్నాయని సింగరేణి జేఏసీ నాయకులు ఎండీ చాంద్‌పాషా, మణిరామ్‌సింగ్ విమర్శించారు. పట్టణంలోని ఎస్జీకేఎస్ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు హసన్, కృష్ణవేణి, వెంకటస్వామి, రవి, లింగన్న, పద్మ, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
తరలిన టీబీజీకేఎస్ నాయకులు..
సీసీసీ నస్పూర్, నవంబర్ 11 : మోదీ పర్యటనను నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన బైక్ ర్యాలీకి శ్రీరాంపూర్ నుంచి నాయకులు తరలివెళ్లారు. ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది నాయకులు బైక్‌లపై గోదావరి ఖని వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెట్టం లక్ష్మణ్, వెంగల కుమారస్వామి, అన్ని గనులు పిట్ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ(సీసీఐ)ను తిరిగి ప్రారంభిం చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు, ఇతర అవకాశాలు ఉన్నా పనరుద్ధరణ విషయంలో బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదు. మంత్రి కేటీఆర్, జిల్లా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినా ఫలితం లేదు. పలుమార్లు లేఖలు రాసినా స్పందన శూన్యం.
ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనంలో నిర్వహిస్తున్నారు. పక్కా భవనం లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం పదెకరాల స్థలాన్ని సేకరించి ఇచ్చినా, ఇప్పటి వరకు నిధులు రాలేదు.
పత్తిపంట సాగులో ఆదిలాబాద్ జిల్లా ఆసియాలోనే పేరుగాంచింది. ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్థానికులకు ఉపాధి లభిస్తుంది. టెక్స్టైల్ పార్కు విషయంలోనూ కేంద్రం స్పందించడం లేదు.