ఇచ్చోడ, నవంబర్, 11: జిల్లాల వారీగా కళోత్సవ పోటీలు నిర్వహించేందుకు విద్యాశాఖ పూనుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణాన్ని వెలికి తీయడంతో పాటు సహజ కళలను ప్రోత్సహించడం, దేశ సమగ్రతను పెంపొందించే విధంగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. సమగ్ర శిక్షణ పాఠశాల విద్యా సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేట్,ఎయిడెడ్, ఇంటర్ కళాశాలు)లో 9వతరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే వారు, కేజీబీవీ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కూడా ఇందులో అవకాశం కల్పించారు. మొదట మండల స్థాయిలో జరిగే కళోత్సవ్ పోటీపాటు నిర్వహించి, ప్రాథమిక స్థాయి ఉత్సవాలకు ఎంపిక చేస్తారు. 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. మొత్తం 10 విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ఎంపిక విధానం ఇలా..
మండల స్థాయిలో ఈ నెల 15 నుంచి 17వతేదీ వరకు ఎంఈవోలు, పాఠశాలల హెచ్ఎంలు న్యాయనిర్ణేతల పర్యవేక్షణలో ప్రతి అంశంలో బాలుర నుంచి ఒకరు, బాలికల నుంచి ఒకరు మొత్తంగా 10 అంశాల్లో ఇద్దరు చొప్పున 20 మందిని ఎంపిక చేసి వారి వివరాలను జిల్లా స్థాయికి పంపుతారు. ఈ నెల 22 నుంచి 24 వతేదీ వరకు జిల్లా స్థాయిలో కళా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.
ఈ సారి ప్రత్యక్షంగా..
తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఏటా 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు కళోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నది. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు విద్యార్థులకు ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు ఆన్లైన్లో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కళోత్సవం పోటీలు నిర్వహించారు. కానీ ఈ సారి విద్యార్థులు వారి కళలను నేరుగా ప్రదర్శించాల్సి ఉంటుంది.
ప్రతిభావంతులను గుర్తిస్తాం..
జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలో ఆసక్తి, ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించడమే ఈ కళోత్సవ్ లక్ష్యం. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయ సిబ్బంది ప్రోత్సహించాలి. దీంతో సాంస్కృతిక అంశాలపై శ్రద్ధ,మానసికోల్లాసం కలుగుతుంది. దేశసమగ్రతపై అవగాహన పెరుగుతుంది. విభిన్న సంస్కృతుల పై సమభావన కలుగుతుంది. తద్వారా విద్యార్థులకు తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. -కే.నర్సయ్య జిల్లా సెక్టోరియల్ ఆధికారి
ఉత్సవాల్లో పది అంశాలు ఇవే..