చెన్నూర్, నవంబర్ 9 : ఒకప్పుడు గ్రామీణ వాతావరణంలో ఉన్న చెన్నూర్ పట్టణం.. ఇటీవల జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పట్టణ రూపురేఖలు సంతరించుకున్నాయి. ప్రధాన రహదారి అభివృద్ధి పనులతో చెన్నూర్ పట్టణానికి కొత్తందాలు చేకూరాయి. ప్రధాన రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్, సెంట్రల్ లైటింగ్, చెట్ల పెంపకంతో పట్టణానికి కొత్త శోభ వచ్చింది. దీంతో ప్రధాన రహదారి ద్వారా రాత్రి వేళ వెళ్లే ప్రజలు, ఇతర ప్రాంతాల వారు ‘ఆహా’ అంటూ అబ్బుర పడుతున్నారు.
ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్)జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తక్షణమే నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని పలు కాలనీల్లో అనేక దఫాలు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాల్లో ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలో.. ఒక నిర్ణయానికి వచ్చారు.
ఇందుకోసం సీఎం కేసీఆర్‌ను కలిసి నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేసి, పట్టణంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు అవసరమైన రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా రూ.25 కోట్లతో పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా జలాల్ పెట్రోల్ బంకు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణతోపాటు ఇరువైపులా మురుగు కాలువలు, ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. అలాగే రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి, చెట్లను పెంచనున్నారు.
అలాగే తెలంగాణ తల్లి విగ్రహం(అస్నాద్ చౌరస్తా), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చౌరస్తా, ప్రతాప మారుతి హన్మాన్ టెంపుల్ చౌరస్తా కూడళ్లను సుందరీకరించనున్నారు. అయితే ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో కొన్ని ప్రస్తుతం జరుగుతుండగా, డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, చెట్ల పెంపకం పనులు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తి కాడటంతో రాత్రి పూట పచ్చని చెట్ల మధ్య జిగేల్మని వెలుగుతున్న సెంట్రల్ లైటింగ్ చూపరులను ఆకట్టుకుంటున్నది. దీంతో పట్టణ రూపురేఖలు మారి పోయాయి.
పట్టణాభివృద్ధికి కృషి..
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి చెన్నూర్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నా. పట్టణంలో దాదాపు రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో రూ.25 కోట్లతో పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంకు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ మధ్యలో చెట్ల పెంపంకం లాంటి పనులు పూర్త య్యాయి. త్వరలోనే రహదారి విస్తరణ పనులు పూర్తి కాగలవు. రానున్న రోజుల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తయితే చెన్నూర్ పట్టణ రూపురేఖలే మారనున్నాయి.
– బాల్క సుమన్, విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు
ఇప్పటి వరకు ఎవరు పట్టించు కోలేదు..
ఇప్పటి వరకు ఎందరో నాయకులు ఎన్నికైనప్పటికీ చెన్నూర్ పట్టణాన్ని ఎవరు పట్టించు కోలేదు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చెన్నూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయించి పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఇప్పటి వరకు చెన్నూర్ పల్లెటూరు మాదిరిగా ఉండేది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులతో పట్టణం మాదిరిగా మారింది. ఇదంతా ప్రభుత్వ విప్, మా ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితోనే సాధ్యమైంది.
– వంగల సమ్మాగౌడ్, స్థానికుడు, చెన్నూర్.
లైట్లు జిగేల్ మంటున్నాయి..
రోడ్డు వెడల్పులో భాగంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లు రాత్రి పూట జిగేల్ మంటున్నాయి. ఇంతకు ముందు మెయిన్ రోడ్డులో ఎక్కడో ఒక చోట స్తంభాలకు లైట్లు ఉండేవి. అక్కడక్కడ వెలుతురు, అక్కడక్కడ చీకటి ఉండేది. ఎవరైనా బస్‌స్టాండ్ నుంచి పట్టణంలోకి రావాలంటే ఈ రోడ్డు గుండానే రావాలి. అప్పుడు రాత్రి పూట చీకట్లతో తిప్పలు పడుతూ వచ్చేది. ఇప్పడు జిగేల్మనే లైట్ల వెలుతురుతో సంతోషంగా వస్తున్నారు. విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పట్టణ ప్రజలు రుణపడి ఉంటారు.
– పోగుల రమేశ్, పేయింటర్, చెన్నూర్.