భారతదేశానికే మాడల్‌గా నిలుస్తున్న మన పల్లెలు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలనలో దేశాభివృద్ధి అన్ని రంగాలలో కుంటుపడింది. పేదలు, రైతులకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. ప్రధాని మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఆస్తులను అనుయాయులకు ధారాదత్తం చేస్తున్నారు. జీఎస్టీతో పేదలతోపాటు మధ్యతరగతి వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి దిక్సూచిలా ముందుండి నడిపించే రథసారథి కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. స్వరాష్ట్ర స్వాప్నికుడు, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, దేశంలో మార్పు తీసుకొచ్చే సత్తా ఆయనకే ఉందని ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ గొప్ప దార్శనికుడని, తెలంగాణను ఎనిమిదేళ్ల పాలనలో చాలా అభివృద్ధి చేశారని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి పొరుగు రాష్ర్టాల వారు అబ్బురపడుతున్నారు. తమకు కూడా ఇలాంటి అత్యద్భుతమైన సంక్షేమ పథకాలు కావాలని, లేదంటే తమను కూడా తెలంగాణలో కలపాలని పక్క మహారాష్ట్ర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచి మార్పు కోసం, బీజేపీ విముక్త్ భారత్ కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని స్పష్టం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాన్ని జిల్లాలుగా విభజించారని, తండాలను పంచాయతీలుగా మార్చారని, మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. అందుకే దేశాభివృద్ధి కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశపాలనా పగ్గాలు చేపట్టాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
– ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ)
రూ.10 లక్షల ఆదాయం సమకూరింది..
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పంచాయతీలు ప్రగతిపథంలో ప్రయాణిస్తున్నాయి. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న పల్లెలు ఈ కార్యక్రమంతో చాలా బాగుపడ్డాయి. గ్రామాల్లో పరిశుభ్రత, మొక్కల పెంపకం, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయి. ముళ్లపొదలు, చెత్తాచెదారం, పెంటకుప్పలు లేకుండా చూస్తున్నాం. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను పంపిణీ చేసింది. రోజు గ్రామంలో ఇంటింటా చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తీసుకొచ్చి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాం. ఏడాదికి ఎనిమిది నెలలు హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందిన్నాయి. సేంద్రియ ఎరువుల తయారీ, మొక్కలకు నీరు పోయడం ద్వారా మా పంచాయతీకీ రూ.10 లక్షల ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంతోపాటు ప్రజలకు అన్ని వసతులు సమకూర్చడం, ఇతర కార్యక్రమాల ద్వారా ముక్రా(కే) పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులు ప్రకటించాయి. దేశంలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు, వర్క్‌షాప్‌లు జరిగినా మాకు ఆహ్వానం అందుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశంలో అన్ని పల్లెలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి.
– మీనాక్షి గాడ్గే, సర్పంచ్, ముక్రా(కే), ఇచ్చోడ మండలం
దేశానికి అద్భుత పాలన అందిస్తాడు..
గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేయడంతో పల్లెలు అద్భుతంగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఊరు కళావిహీనంగా ఉండేది. ఈ ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రగతి దూసుకెళ్లింది. గ్రామంలో 90 శాతం సీసీ రోడ్లు, మురు గు కాలువల నిర్మాణాలు పూర్తయ్యాయి. రూ.13 లక్షలతో కొత్త పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నం. ఇటీవలే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకా రంతో రూ.30 లక్షలు వెచ్చించి చెరువు కట్టను విస్తరించుకోవడం జరిగింది. దీనివల్ల జాతీయ రహదారి నుంచి కేవలం కిలోమీటరు దూరంలోనే మా గ్రామానికి రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. చెరువు కట్టపై సీసీ లేదా బీటీ రోడ్డు వేసేందుకు మంత్రి మరో 20 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే ఇలా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. మన రాష్ట్రం మనకు వస్తే ఈవిధంగా అభివృద్ధి చేసుకోవచ్చని ముందే గుర్తించిన కేసీఆర్.. 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నది. ఇలాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ మాదిరిగా ఇక్కడి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– సూరపు సాయన్న, సర్పంచ్, నీలాయిపేట్, నిర్మల్ రూరల్ మండలం.
మా పాఠశాలను మాడల్ స్కూల్‌గా ప్రకటించారు..
నాలుగేళ్ల క్రితం మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుకునేవారు. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో అభివృద్ధి చేసి, గ్రామంలోని పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తీర్మానం చేశాం. దీంతో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 200లకు పైగా చేరింది. దీంతో మా పాఠశాలను మాడల్ స్కూల్‌గా ప్రకటించి రూ.16 లక్షలు మంజూరు చేశారు. సౌకర్యాలు కల్పించాం. గ్రామంలోని 350 కుటుంబాలకు గత నాలుగేళ్లుగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలం అందిస్తున్నాం.హరితహారంలో భాగంగా దాదాపు 50 వేల మొక్కలు నాటడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఎవరూ ఊహించని రీతిలో పల్లెలు అభివృద్ధి చెందాయి. ఇదంతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు వల్లే సాధ్యమైంది. ఇలాంటి పాలన దేశవ్యాప్తంగా జరగాలంటే మన కేసీఆర్ సారు దేశ ప్రధాని కావాలి.
– కుంట దుర్గ పద్మాకర్, సర్పంచ్, మేడిపెల్లి, నిర్మల్ రూరల్ మండలం.
కేసీఆర్ పాలనలోనే పల్లెల ప్రగతి..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా.. అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. పల్లెల ప్రగతిని పట్టించుకోలేదు. కానీ.. స్వరాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ సీఎం కావడంతో గూడేలు, తండాలు, గ్రామాల స్వరూపం మారిపోయింది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతువేదికలు, కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ భవనాలు ఇలా అనేక నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి.. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు నిర్మించారు. ఇలా గ్రామాలు ప్రతి రంగంలో ప్రగతి సాధించడంతో పట్టణాలను తలపిస్తున్నాయి. కాగా.. మా జీపీకి ఉత్తమ పంచాయతీగా అవార్డు వచ్చింది. రెండేండ్ల క్రితం కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నా. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఉంటే మా గ్రామం ఇంత అభివృద్ధి జరుగకపోయేది. నాకు అవార్డు రాకపోయేది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లుతున్నది. ఎక్కడా చూసినా పచ్చదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే, మన పల్లెల మాదిరిగా దేశంలోని అన్ని గ్రామాలను మారుస్తాడనే నమ్మకం ఉంది. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. – డి.రాజు, సర్పంచ్, ఖత్గాం, భైంసా మండలం.
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అందరు సమ్మతిస్తున్నరు..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని అన్ని వర్గాల ప్రజలు సమ్మతిస్తున్నరు. మన రాష్ట్రంలో కులం, మతం అనే బేధం లేకుండా సబ్బండవర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది మన సీఎం కేసీఆర్ సార్కే చెల్లింది. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. అన్ని వర్గాల గురించి ఆలోచించే విజన్ ఉన్న నేత కేసీఆర్ దేశరాజకీయాలకు చాలా అవసరం. రైతులు, యువకులు, మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చేందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. మన రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రతి రాష్ట్రంలో అమలుకావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి చక్రం తిప్పుతారన్న దానిలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. జాతీయ స్థాయిలో పార్టీ స్థాపించినట్లయితే మంచి దేశం పురోగమిస్తుంది.
– గంగుల వెంకన్న, సర్పంచ్, బండలనాగాపూర్.
అన్ని వర్గాల ప్రజలకు మేలు
బోథ్, సెప్టెంబర్ 14 : కేసీఆర్ లాంటి ముందుచూపున్న నేత దేశ రాజకీయాల్లోని వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సంపన్న వర్గాలకు మేలు చేసేలా పాలన కొనసాగిస్తున్నది. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం, పండించిన పంటలకు మద్దతు ధర వంటి పథకాలు కేసీఆర్‌తోనే సాధ్యమవుతాయని తెలంగాణలో నిరూపితమైంది. పేదవర్గాల ప్రజలకు రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగా నెలానెలా రూ. 2016 పింఛన్ అందితే ఆర్థికంగా తోడ్పాటు అందుతుంది. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొడుతున్నది. రాష్ట్రలపై వివక్ష చూపుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నది. దేశంలో సమానత్వం, నిధుల కేటాయింపు వంటివి పక్కా అమలు కావాలంటే కేసీఆర్ కేంద్రంలో ఉంటే సాధ్యమవుతుంది.
– జీ.సురేందర్ యాదవ్, సర్పంచ్, బోథ్.