ఎదులాపురం, అక్టోబర్ 19 : సీసీ కెమెరాల అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ప్రాధాన్యతను జిల్లా ప్రజలకు వివరించి, వాటి ఏర్పాటుకు కృషిచేయాల్నరు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామం సీసీ టీవీ పరిధిలోకి వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలను వాటి స్థితిగతులును, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకొని న్యాయస్థానంలో ముద్దాయికి శిక్షపడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.
వాహనాల పనితీరు పరిశీలన..
పోలీసు వాహనాల పనితీరును, వాటి నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. వాహన నిర్వహణ లోటుపాట్లపై ఎంటీవో బీ శ్రీపాల్ నివేదిక అందజేశారు. జిల్లాలోని 22 పోలీస్సేషన్ల పరిధిలో వాహనాలు నిరంతరం ప్రజాసేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. మంచి కండీషన్లో ఉంచిన రెండు వాహనాలను గుర్తించి, డైవర్లకు నగదు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్‌జాన్‌రావు, డీఎస్పీ వీ ఉమేందర్, పట్టణ సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, బీ రఘుపతి, ఐ సైదారావు, మోటార్ హహనాలు సీఐ బీ శ్రీపాల్, ఆర్ఐ డీ వెంకటి, సిబ్బంది మహేంద్రచారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం ప్రారంభం..
జిల్లా పోలీసుల హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద జ్యోతి వెలిగించి, నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 280 మంది రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, రిమ్స్ డాక్టర్ రాజ్యలక్ష్మి, సీఐలు కే మల్లేశ్, కే నరేశ్ కుమార్, ఈ చంద్రమౌళి, జే కృష్ణమూర్తి, రిజర్వ్ సీఐ డీ వెంకటి, బీ శ్రీపాల్, ఎం వంశీకృష్ణ, రిమ్స్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.