ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను వరుణుడు వదలడం లేదు. దాదాపు జూలై అంతా వర్షం కురుస్తూనే ఉంది. మధ్యమధ్యన ఒకటీ, రెండు రోజులు గెరువిచ్చినా.. యథావిధిగా వర్షం పడుతూనే ఉంది. తాజాగా మంగళవా రం మేఘాలు గర్జించడంతో కుండపోత వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా బాసరలో అత్యధికంగా 91 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతా లు జలమయం కాగా.. రహదారులు, బ్రిడ్జిలపై నుంచి వరద వెళ్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. జలాశయాల్లోకి భారీగా వరద చేరుతున్నది. అంతేస్థాయిలో అధికారులు దిగువనకు వదులుతున్నారు. అధికారయంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది.
ఆదిలాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. మంగళవారం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సగటు 27.4 మిల్లీమీటర్లు నమోదు కాగా.. తాంసి మండలంలో 70, ఆదిలాబాద్ రూరల్‌లో 61, గాదిగూడలో 55.8, బేలలో 51.6, ఆదిలాబాద్ అర్బన్ 39.3, తలమడుగులో 33.3, జైనథ్‌లో 32.2, భీంపూర్‌లో 26, ఇంద్రవెల్లిలో 25.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
నిర్మల్ జిల్లాలో అధికంగా బాసరలో 91 మిల్లీ మీటర్లు, మథోల్లో 76.4, తానూర్‌లో 50.8, 29.2 మిల్లీ మీటర్ల వర్షం పడింది. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరింది. పలు గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల, కొరిటికల్, బోథ్ మండలం పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. సారంగాపూర్ మండలం స్వర్ణ, భైంసాలో గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. స్వర్ణ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుంచి 35 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో అధికారులు నాలుగు గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని వదుతున్నారు.
గడ్డెన్న ప్రాజెక్టులోకి 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులోకి 9,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండడంతో అధికారులు రెండు గేట్ల ద్వారా 9,600 క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు.
తాంసి మండలం మత్తడి ప్రాజెక్టులోకి 9,228 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మూడు గేట్ల ఎత్తిన అధికారులు 9,228 క్యూసెక్కుల నీటిని బయటకు విడిచిపెట్టారు. భారీ వర్షాల కారణంగా రెండు జిల్లాల్లో అధికారులు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.