రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా రూ.5 లక్షలతో ఊరికో ఆట స్థలాన్ని కేటాయిస్తున్నది. ప్రతి గ్రామంలో ఎకరం నుంచి ఎకరన్నర స్థలంలో మైదానాలు సిద్ధం చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో 549 క్రీడా ప్రాంగణాల ఏర్పాటునకు కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం(జూన్ 2) రోజున వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నది. దీంతో ఆట స్థలాల చుట్టూ నీడనిచ్చే మొక్కలు నాటి, వాటిని సంరక్షించనున్నది. ఇందుకోసం మండలానికో ప్రత్యేకాధికారిని కూడా నియమించనున్నది.
దండేపల్లి, మే 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని సంకల్పించింది. పల్లెల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు కంకణం కట్టుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆవిర్భావ(జూన్ 2) దినోత్సవం నాటికి ఊరికో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రస్థాయి నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉండగా.. 549 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటునకు కసరత్తు చేస్తున్నది. ఒక్కో ప్రాంగణం ఎకరం నుంచి ఎకరన్నర స్థలంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సగం క్రీడా ప్రాంగణాల స్థలాల సేకరణ కూడా పూర్తయింది.
మిగతా క్రీడా ప్రాంగణాల ఏర్పాటునకు స్థలాల గుర్తింపు ప్రక్రియను రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు చేపడుతున్నారు. వీటి పనులు ఉపాధి హామీ నిధులతో చేపడుతుండగా.. స్థలాన్ని చదును చేయడం, ముళ్ల పొదలు తొలగించడం, మొరం నింపడం వంటి ప నులు ఉపాధి కూలీలకు కేటాయించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రతి క్రీడా ప్రాంగణంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్‌జంప్ పిట్, సింగిల్ లేదా డబుల్ ఎక్సర్సైజ్ బార్లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి మండలంలో జూన్2వ తేదీ నాటికి రెండు క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేసి తెలంగాణ ఆవిర్భావం రోజున ప్రారంభించేందుకు అధికారులు చకచకా చర్యలు చేపడుతున్నారు. ఐదు క్రీడాంశాలకు సంబంధించిన కొలతలు, ప్రాంగణానికి ఆర్చ్ నిర్మాణం, క్రీడా ప్రాంగణం చుట్టూ గ్రీనరీ ఉండేందుకు ప్లాంటేషన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కాగా.. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు మండలానికో ప్రత్యేకాధికారి ఉండనున్నారు.
ప్రస్తుతం గ్రామాల్లో ఆటలాడేందుకు సరైన వసతులతో కూడిన ఆట స్థలాలు లేవు. దీంతో చిన్నారుల క్రీడా నైపుణ్యం మరుగున పడిపోతున్నది. సమీపంలో ఉన్న పట్టణాలకు వెళ్లి శిక్షణ తీసుకునే స్థోమత లేక ప్రతిభ వెలుగులోకి రావడం లేదు. చాలా గ్రామాల్లో వాలీబాల్, కబడ్డీ ఆడుకోవడానికి కూడా స్థలాలు లేవు. పాఠశాలల్లో మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో పల్లె క్రీడాకారులు మండల, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి వేదికలపై రాణించే అవకాశం ఉంది. కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పల్లెల్లో రెవెన్యూ, పంచాయతీ, ఈజీఎస్‌ల సమన్వయంతో స్థలాల ఎంపిక జరుగుతుందని మంచిర్యాల డీఆర్డీవో శేషాద్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు నిర్మించాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే గ్రామాల్లో క్రీడలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. దశాబ్దాల కిందట రాత్రి వెన్నెల వెలుగులో కబడ్డీ వంటి ఆటలు ఆడేవారు. నేడు ఆటల ఊసే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం గర్వకారణం. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
– సంపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయురాలు, జడ్పీ ఉన్నత పాఠశాల, ఇందన్‌పెల్లి