ఎదులాపురం,మే27: అనధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్‌లో ప్రత్యేక బృందాలు చేపడుతున్న సర్వేను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 58,59 ఉత్తర్వుల ప్రకారం సర్వే నిర్వహించి ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ రిసోర్స్ పర్సన్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో యజమానులు గుర్తించి వివరాలు సేకరించాలని సూచించారు. దరఖాస్తుదారులకు ముందుస్తు సమాచారం అందించాలన్నారు.
వేసవి దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వే చేపట్టాలని సూచించారు. ఖాళీ స్థలాలను నిబంధనల ప్రకారం తిరస్కరించాలని, క్రమబద్ధీకరణకు అవసరం లేని వారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని తిరస్కరించాలని ఆదేశించారు.ఆర్డీవో రమేశ్ రాథోడ్ ,జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి రంగారావు, డీసీవో శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్‌రాజు, గ్రామీణ తహసీల్దార్ శివరాజ్, భూమి,కొలతల సహాయ సంచాలకుడు రాజేందర్, రెవెన్యూ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రిక్షాకాలనీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ డిప్యూటీ ఈఈ తిరుపతి తదితరులు ఉన్నారు.
నిర్మల్ టౌన్, మే 27 : ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాంరావ్బాగ్లో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన వారికి నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు. ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ సుభాష్‌చందర్, ఆర్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.
భైంసా, మే 27 : ప్రభుత్వ భూమిలో ఎన్నో ఏళ్లుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న వారిలో అర్హులకు క్రమబద్ధీకరణ చేస్తామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. భైంసా ఆర్డీవో కార్యాలయంలో క్రమబద్ధీకరణ దరఖాస్తులను శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అనధికార ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. జారీ 58, 59 ప్రకారం సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఆర్డీవో లోకేశ్వర్ రావు, సిబ్బంది ఉన్నారు.