నిర్మల్ టౌన్, మే 23 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో ఆవిర్భావ వేడుకలపై సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు.
ఉదయం 8 గంటలకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. స్టేడియంలో పరేడ్ గ్రౌండ్, స్టాళ్లు, వివిధ ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నివేదికలను వెంటనే కలెక్టరేట్‌కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆయా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.