ఆసిఫాబాద్, మే 23 : సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజల నుంచి సోమవారం ఆయన అర్జీ లు స్వీకరించారు. కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ ప్రాంతానికి చెందిన కౌసర్ సుల్తానా తాను దివ్యాంగురాలినని తన భర్తకు క్యాన్సర్ కారణంగా రెండు కాళ్లు పోయాయని, జీవనోపాధి కోసం రుణం ఇప్పించాలని విన్నవించింది.
దహెగాం మండలం ఈటపల్లికి చెందిన బోరెం పోచయ్య తాను ఎస్టీ మన్నెర కులానికి చెందిన వాడినని తన భూమని కబ్జా చేసి దౌ ర్జన్యం చేస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని విన్నవించాడు. బెజ్జుర్ మండలం అందుగులగూడెం గ్రామానికి చెందిన తొర్రె హన్మాంతు తన సాగు భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించి రైతుబంధు పథకం వర్తింపచేయాలని వినతి పత్రం అందజేశాడు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో పంట కోత ప్రయోగంలో సాంకేతికతను ఉపయోగించి దిగుబడులను ఖచ్చితంగా అంచనా వేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూ చించారు. తన చాంబర్లో జిల్లా ప్రణాళిక అధికారి రవీందర్‌తో కలిసి మండల ప్రణాళిక అధికారులకు పంట కోత ప్రయోగం కిట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలానికి రెండు కిట్లు అందించామని, వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.