నిర్మల్ చైన్‌గేట్, మే 19 : పదో తరగతి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్‌లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం అధికారులతో పదోతరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను నీడలో తనిఖీ చేయాలన్నారు. గంట ముందు పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు. కేంద్రాలలో ఓఆర్ఎస్ కలిపిన తాగునీరు అందించాలన్నారు. జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా పని చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, సెక్టోరియల్ అధికారులు, సీఎస్‌లు, డీవోలు, ముఖ్య పర్యవేక్షణ అధికారులు, ఇన్విజిలేటర్లు, పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, మే 19 : సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతికి అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతిలో ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో మొక్కలు నాటాలని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో 1500 మంది లబ్ధ్దిదారులకు దళితబంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీపీవో వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్/నిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా సంపత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఇది వరకు భైంసాకు చెందిన ఎంఏ అలీం ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్‌గా పని చేశారు. అతని స్థానంలో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌ను పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ ఉద్యోగులు కలిశారు.
నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలను చేపట్టిన సంపత్‌కుమార్ గురువారం సాయంత్రం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో పాటు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేను మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందజేశారు. నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికి కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట డీఈ హరీశ్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.