ఇంద్రవెల్లి, మే 14 : ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు తమ కులదేవత పెర్సపేన్ (పెద్దదేవుడు) ప్రత్యేక పూజలకు శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరంలో భావై నెలను పురస్కరించుకొని పౌర్ణమి నుంచి అమావాస్య వరకు గిరిజన సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ గిరిజనుల్లోని ప్రతి వంశానికి చెందిన వారు తమ కులదేవత ఉన్నచోటుకు కుటుంబ సమేతంగా తరలివస్తుంటారు.
మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉర్వేత వంశీయుల ఆధ్వర్యంలో శనివారం పెర్సపేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేస్లాపూర్ గ్రామంలో ఉన్న ఉర్వేత వంశీయులు పెర్సపేన్కు సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పొలిమేరలోని ఓ చెట్టువద్ద పెర్సపేన్కు నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం దేవతను గ్రామం చుట్టూ గిరిజన సంప్రదాయం ప్రకారం ఊరేగించారు. పెర్సపేన్కు నిర్వహించే పవిత్రమైన స్నానానికి సంప్రదాయ వాయిద్యాల మధ్య తరలించారు.