బలాలు, బలహీనతలు, పొరపాట్లు గుర్తించే అవకాశం
వృత్తిపరమైన సవాళ్లను అధిగమించేందుకు..
గుణాత్మక విద్యనందించేందుకు దోహదం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డాటా నమోదు చేస్తున్న టీచర్లు
66 శాతంతో రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఆదిలాబాద్
నేటితో ముగియనున్న ప్రక్రియ
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 23 : ఉపాధ్యాయుల పనితీరుపై స్వీయ మదింపు చేసుకునేందుకు టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రుబ్రిక్స్(టీఎస్ఏఆర్) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దీనికి ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన వస్తున్నది. కాగా, ఇందు కోసం రూపొందించిన వెబ్సైట్(టీసార్)లో స్వీయ మదింపు చేసుకోవడంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయులు నిలిచారు. ఈ వెబ్సైట్లో 47 అంశాలతో కూడిన నిర్ణీత ఫార్మాట్‌ను రూపొందించారు. శనివారం సాయంత్రంతో ఈ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు ముగించనున్నారు. దీని ద్వారా వచ్చే వారి గ్రేడ్లను బట్టి వివిధ రకాల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
జిల్లాల వారీగా..
ప్రభుత్వ జడ్పీ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌స్కూళ్ల ఉపాధ్యాయులు టీసార్లో తమ విద్యార్హతలు, అకాడమిక్ విద్యార్హత, బోధనలో తీసుకుంటున్న మెళకువలు, ఎలా బోధిస్తున్నారు.. లాంటి అనేక విషయాలతో స్వీయ మదింపు చేయనున్నారు. టీసార్లో ఇప్పటికే ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2326 మంది ఉపాధ్యాయులు ఉండగా, ఇప్పటికే 1536 మంది నమోదు చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో 3231 మంది 304 మంది, మంచిర్యాల జిల్లాలో 3,390 టీచర్లకు 1,358 మంది ఉపాధ్యాయులు స్వీయ మదింపు చేసుకోగా, 390 మంది ఉపాధ్యాయుల డాటాను నిర్ధారించారు. ప్రతి ఉపాధ్యాయుడు స్వీయమదింపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లావిద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.
లక్ష్యాలు ఇలా…
ఉపాధ్యాయుడి పనితీరు మదింపు కార్యక్రమం ద్వారా బోధనా విధానం తెలుసుకొనే వీలు కలుగుతుంది. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మరింత శిక్షణ అందించే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులకు తమ బలం, బలహీనతలు, బాధ్యతలు తెలుసుకొనేలా ఈ కార్యక్రమం చేపట్టారు. వృత్యాంతర శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు గుణాత్మక విద్య అందించేందుకు వీలవుతుంది. అభ్యసన అనుభవాల రూపకల్పన, విషయ పరిజ్ఞానం, విషయ అవగాహనలాంటి వాటిని శిక్షణ ద్వారా పెంపొందించే అవకాశం ఏర్పడుతుంది. ఈ స్వీయ మదింపు చేసుకునేందుకు జిల్లాలో 16, 17 తేదీల్లో జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
ఆచార్య వడ్డీ భారం కొరటాల శివ మోయక తప్పదా..?
కర్ణన్ డైరెక్టర్ తో రెండోసారి..!