భీమిని, ఆగస్టు 5 : అధికారులు, సిబ్బంది విధులను నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం భీమిని మండలంలో పర్యటించా రు. మల్లీడిలోని నర్సరీని పరిశీలించారు. ఇంకా ఎందుకు మొక్కలు నాటలేదని మల్లీడి పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వహించడం ఇష్టం లేకపోతే మానేయాలని హెచ్చరించారు. ఆపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామానికి చెందిన పులగం శ్రీలత, పులగం సాలక్క ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రావడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. మిగితా వారందరికీ వచ్చాయని, తమకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు.
వంట గదిలో కూరగాయలు నిల్వ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన కూరగాయలతో వంట చేయాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు, సిబ్బందిని ఓపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని, మందులు అందజేయాలని సూచించారు. సమయ పాలన పాటించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో గంగామోహన్, మల్లీడి పంచాయతీ కార్యదర్శి పున్నం ఉన్నారు.
కన్నెపల్లి, ఆగస్టు 5 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం కన్నెపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించారు. అనంతరం కస్తూర్బాను సందర్శించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, కార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.