నిర్మల్ చైన్‌గేట్, జూలై 17 : నకిలీ విత్తన విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని, విత్తన దుకాణాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, నకిలీ విత్తనాల అమ్మకాలు, స్కానింగ్ కేంద్రాల తనిఖీ, రోడ్డు భద్రత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విత్తన దుకాణాల్లో నిరంతరం తనిఖీలు జరపాలన్నారు.
ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 32 మంది బాల కార్మికులను గుర్తించి, 19 కేసులు నమోదయినట్లు తెలిపారు. ఈ ఏడాది 12 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. పాఠశాలల్లోని 72,876 విద్యార్థినులకు గుడ్, బ్యాడ్ టచ్ బాల్య వివాహాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఎస్పీ జానకి షర్మిల, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధిక, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు..
ఆయిల్ పామ్ పంటల విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం ఆయిల్ పామ్ సాగుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా జిల్లాకి 4,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ఇచ్చారన్నారు. ఆయిల్ పామ్ సాగుకి నీటి వసతి ఉన్న రైతులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి రమణ, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంగన్వాడీల్లో వసతులు కల్పించాలి
అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని స్థానిక సంస్తల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో స మావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడీ కేంద్ర ంలో చిన్నారులకు అనుకూలమైన, శుభ్రమైన వాతావరనాన్ని కల్పించాలన్నారు. సమావేశంలో సీడీపీవోలు నాగమణి, నాగలక్ష్మి, సరిత పాల్గొన్నారు.