కాసిపేట, నవంబర్ 11 : మండలం గురువాపూర్, పెద్ద ధర్మారం, చింతగూడ గ్రామ శివార్లలో పెద్దపులి సంచరిస్తుండగా, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం దేవాపూర్ సల్పాలవాగు వైపునకు వచ్చినట్లు తెలిసింది. ఆపై మద్దిమాడ అటవీ శివారు వైపు వెళ్లిందా.. లేక ధర్మారావుపేట శివారు ప్రాంతానికి వెళ్లిందా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే గురువాపూర్ శివారులో, దేవాపూర్ మద్దిమాడ శివారులో పశువులపై దాడి చేసి చంపిన విషయం విదితమే. పెద్దపులి సంచారంతో అటవీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. పల్లెల్లో అవగాహన కల్పిస్తున్నారు. కాగా, రెండేళ్లుగా గురువాపూర్ శివారు అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుండగా, 15 రోజులుగా పెద్దపులి ఆవాసం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు.