ప్రమాదం జరిగినపుడు, జారి పడినపుడు ఎముకలు విరిగినా.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చినా.. గర్భిణుల్లో బిడ్డ ఎదుగుదల, ప్రసవ సమయంలో ఇబ్బందులు రాకుండా.. వృద్ధాప్యంలో మొకాళ్ల నొప్పులు వచ్చినపుడు సహజంగానే ప్రైవేట్ హాస్పిటల్స్‌కు పరుగులు పెడుతాం. వేలాది రూపాయలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకుంటాం. కానీ.. ఈ పరీక్షలన్నీంటినీ ఉచితంగా చేయడానికి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో రేడియాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రూ.70 లక్షలతో అధునాతన పరికరాలను సమకూర్చారు. ఇందులో ఈసీజీ, టూ డీ ఈకో, మమ్మోగ్రఫీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ యంత్రాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వైద్యులు టెస్టులను చూసి చికిత్స అందిస్తారు. నిరుపేదలకు వేలాది రూపాయలు ఆదాకానుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావాసులకు వైద్యం అందని ద్రాక్షలా ఉండేది. స్వరాష్ట్రంతో వైద్యానికి పెట్టపీఠ వేయడంతో సేవలు మెరుగుపడ్డాయి. నూతన భవనాలు నిర్మించడం, యంత్రాలు సమకూర్చడం, అవసరమైన మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో సర్కారు దవాఖానలకు పేషెంట్లు బారులుదీరుతున్నారు. ప్రసవాలకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో పీహెచ్సీలలో డెలివరీల సంఖ్య పెరిగింది. ప్రతినెలా 20-30 వరకు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీహెచ్సీ, యూహెచ్సీలకు వచ్చిన రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపిస్తారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలను వైద్యుడితోపాటు పేషెంట్ల మొబైల్స్‌కు మెస్సేజ్ చేస్తారు. వీటి ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు.
రేడియాలజీ ల్యాబ్‌లో ఉచిత పరీక్షలు
ప్రమాదంలో ఎముకలు విరిగినా, ఇతర సమస్యలు వచ్చినా, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందించడానికి పరీక్షలు చేయాలి. గర్భిణులకు కూడా కడుపులో బిడ్డ ఎదుగుదల, ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా టెస్టులు నిర్వహించాలి. ఈ పరీక్షలకు ప్రైవేటు దవాఖానల్లో అయితే వేల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షలతో రిమ్స్‌లో రేడియాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.
సీఆర్ ఎక్స్‌రే..
రోడ్డు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు, జారీ కింద పడినప్పుడు ఎముకలు విరగడం సహజం. వృద్ధాప్యంలో మొకాళ్ల నొప్పులు, బొక్కల సమస్యలు అధికమవుతాయి. వైద్యులు ఎక్స్‌రేలు తీయించి అవసరమైన వైద్యం అందిస్తారు. ప్రైవేటు ల్యాబ్ లో ఎక్స్‌రేలకు రూ.400-రూ.2500 వరకు తీసుకుంటారు. రేడియాలజీ ల్యాబ్‌లో ఇప్పుడు అన్ని రకాల ఎక్స్‌రేలు ఉచితంగా తీస్తారు.
ఈసీజీ, టూ డీ ఈకో
రేడియాలజీ ల్యాబ్‌లో ఈసీజీ, టూ డీ ఈకో పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. గుండెనొప్పి, ఇతర సమస్యలు వచ్చినప్పుడు వైద్యం చేయడానికి ఈ పరీక్షలు చేస్తారు. ప్రైవేటు ల్యాబ్‌లో ఈసీజీకీ రూ.300, టూ డీ ఈకో రూ.2500 తీసుకుంటారు. ఈ పరీక్షలు చేయడానికి రూ.12 లక్షల విలువ చేసే టూ డీ ఈకో మిషన్‌ను ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు.
అల్ట్రాసౌండ్ మిషన్
గర్భిణుల్లో బిడ్డ ఎదుగుదల, ప్రసవ సమయంలో ఇబ్బందులు రాకుండా పరీక్షలు చేయాలి. వీటికి ప్రైవేటులో రూ.1200 తీసుకుంటారు. ప్రభుత్వం రూ.6 లక్షలతో అల్ట్రాసౌండ్ యంత్రాన్ని సమకూర్చింది. ఈ యంత్రం ద్వారా గర్భిణులకు పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు.
మమ్మోగ్రఫీ పరీక్షలు
మహిళలు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇందులో ప్రధానంగా బ్రెస్ట్ సమస్యలు అధికంగా వస్తుంటాయి. వీటికి చికిత్స చేయడానికి ప్రభుత్వం రూ.17 లక్షలతో యంత్రాన్ని ఏర్పాటు చేసింది. రేడియాలజీ ల్యాబ్‌లో మమ్మోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రైవేటులో రూ.5 వేల వరకు తీసుకుంటుండగా.. రేడియాలజీ ల్యాబ్‌లో ఉచితంగా చేస్తారు.
సేవలను వినియోగించుకోవాలి..
రిమ్స్‌లో ప్రభుత్వం రూ.70 లక్షలతో రేడియాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఈసీజీ, టూ డీ ఈకో, మమ్మోగ్రఫీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ యంత్రాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. అనారోగ్యంతో బాధపడేవారు ప్రభుత్వాసుపత్రులకు వచ్చి వైద్యుల సూచనల మేరకు రేడియాలజీ ల్యాబ్‌లో ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలి. రిమ్స్‌లో అన్ని రకాల వైద్యసేవలను ప్రభుత్వం అందిస్తున్నది.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్