కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/జైనూర్, సెప్టెంబరు 9 : జైనూర్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల నేథప్యంలో పోలీసుల పహారా ఇంకా కొనసాగుతున్నది. ఎక్కడా ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుం డా బందోబస్తు నిర్వహిస్తున్నారు. జైనూర్లోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. సోమవారం కూడా ఆంక్షలు విధించారు.
ఇక్కడ జరిగిన విధ్యంసంపై పో లీసులకు సుమారు 120 ఫిర్యాదులు అందినట్లు సమాచారముండగా, అందులో దాదా పు 200 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తున్నది. సోషల్ మీడియాల్లో వచ్చిన వివిధ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు ఇప్పటికే 13 మందిపై కేసులు నమోదు చేయగా, సోమవారం మరో ఐదుగురిని అదుపులోకి తీ సుకున్నట్లు తెలిసింది. ఆరు రోజులుగా స్థానిక మార్కెట్‌ను బంద్ చేయడంతో ప్రజలు నిత్యావసరాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కొందరు ఉట్నూర్, హస్నాపూర్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. జైనూర్, కెరమెరి, తిర్యాణి, వాంకిడి మండలాల్లో ఇంకా నెట్ సేవలు ప్రారంభం కాలేదు. సోమవారం కెరమెరి మండలంలోని వ్యాపారస్తులు, ఆదివాసీలు సామరస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మార్కెట్‌ను తెరిచే అంశంపై చర్చించుకున్నారు. ఆదివాసీలు, ఇతర వర్గాల వారు వ్యాపారస్తులకు ఎలాంటి నష్టం చేయకూడదని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
మార్కెట్ బంద్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరినట్లు సమాచారం. ముఖ్యంగా రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునేందుకు, పెన్షన్లు పొందేందుకు నెట్ లేకపోవడం వల్ల ఆదివాసీలు, సాధారణ ప్రజలకు కూడా ఇబ్బందులు పడుతున్నారని, నెట్ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం. జైనూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.