మంచిర్యాల అర్బన్, మార్చి 2 : పర్యావరణంలో ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై మరింత సమగ్ర అధ్యయనం అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా) డాక్టర్ సువర్ణ అన్నారు. అటవీ శాఖ-వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో మంచిర్యాలలో రెండు రోజులుగా నిర్వహించిన బర్డ్స్ ఫెస్టివల్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది. మంచిర్యాలలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పక్షుల గమనానికి పరిధులు లేవని, పర్యావరణంలో జరిగే పెనుమార్పుల వల్ల కొన్ని జాతులు వేలాది కిలోమీటర్లు వలస వెళ్తుంటాయన్నారు.
ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం పక్షులని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్, తమిళనాడుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ విజయన్ మాట్లాడుతూ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో వేల పక్షులు సంచరిస్తున్నాయని, రెండేళ్లుగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహకారంతో జన్నారం అటవీ డివిజన్లో దీర్ఘకాలిక పరిశీలన చేసి 201 జాతుల పక్షులను గుర్తించామని తెలిపారు. జిల్లా పరిధిలోని మిగతా అటవీ డివిజన్లలో కూడా అటవీ సిబ్బంది తమ పరిధులలోని పక్షుల గమనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేసుకోవాలని సూచించారు. కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని రాబందుల సంరక్షణకు తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని, అందువల్లే వాటి సంఖ్య పెరుగుతుందని తెలిపారు.
నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ శాస్త్రవేత్త మహేశ్శంకరన్ మాట్లాడుతూ పక్షులు అంతరిస్తే బయోడైవర్సిటీ దెబ్బతింటుందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రధాన అధికారి బండి రాజశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో 11 పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయన్నారు. 57 జాతుల పక్షులు కేవలం అటవీ, ప్లాంటేషన్ ఏరియాలోని సంచరిస్తున్నాయని పరిశీలించామన్నారు. 99 జాతుల పక్షులు కీటకాలు తినే వాటిగా,16 జాతుల పక్షులు కేవలం పండుల తినే పక్షులుగా గుర్తించినట్లు వెల్లడించారు.
బర్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంరక్షణలో సేవలందిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతారాంతో కలిసి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ కుమార్ పాటిల్, మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ అధికారి సర్వేశ్వరరావు, పక్షులపై అధ్యయనం చేస్తున్న ప్రముఖులు డాక్టర్ శాంతారాం, డాక్టర్ బిక్షం గుజ్జ, డాక్టర్ సాథియా సెల్వం, సంజీవ్ మీనన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.