నమస్తే నెట్వర్క్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. అమిత్‌షా దిష్టిబొమ్మలు దహనం చేశాయి. కౌటాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. అమిత్‌షా దిష్టి బొమ్మను దహనం చేశారు. వాంకిడి జాతీయ రహదారిపై దళిత సంఘాల నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహులార్ మాట్లాడుతూ అంబేదర్ రాజ్యాంగం రచించడం వల్లే అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
పెంచికల్పేట్ మండల కేంద్రంలోని హనుమాన్ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అమిత్‌షా వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బిట్టు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, స్థానిక నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆమిత్ షా ముక్కు నేలకు రాసి యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు సిటిమల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నస్పూర్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించిన స మావేశంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేది క రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించారు. తాండూర్ మండలం కాసిపేటలో నేతకాని సంఘం నా యకుల ఆధ్వర్యంలో అంబేదర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేదర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కాసిపేట మండల కేంద్రంలో అంబేదర్ విగ్రహానికి అంబేదర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మాదిగ హక్కుల దండోరా నాయకులు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దళిత సంఘాల నాయకులు దహనం చేశారు. నేతకాని మహర్ హక్కుల సంఘం నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేశారు.