మంచిర్యాల, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ పట్టణంలోని భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ లీడర్ అక్రమాలకు తెరలేపాడు. ఫేక్ ఇంటి నంబర్‌తో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి కాజేయాలని చూడగా, బాధితుడు కలెక్టర్‌ను ఆశ్రయించడంతో అసలు బాగోతం బయటపడింది. ఈ విషయ మై విచారణ చేపట్టిన అధికారులు అసలు అక్కడ ఇల్లే లేదని, అక్రమంగా ఇంటి నంబర్ పొందారని నిర్ధారించి, ఆపై ఆన్లైన్ నుంచి ఆ ఇంటి నంబర్‌ను తొలగించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సదరు ‘హస్తం’ నేత క్యాన్సల్ చేసిన అదే ఇంటి నంబర్‌తో మరో డాక్యుమెంట్ చేయించగా, ఇక ఏం చేయాలో తోచక బాధితుడు న్యాయం కోసం ప్రాధేయపడుతున్నాడు.
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై గతవారం ‘నమస్తే తెలంగాణ’ లో ‘రూ.40 వేలిస్తే.. ఏ ప్లాటైనా రిజిస్ట్రేషన్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆ వార్త చూసిన చెన్నూర్‌కు చెందిన ఓ బాధితుడు తనకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించా డు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన పొరపాటు గురించి వివరించాడు. కలెక్టర్ ఆదేశాలతో రద్దు చేయబడి, ఆన్లైన్ నుంచి తొలగించబడిన ఇం టి నంబర్‌ను ఆధారంగా చేసుకొని సబ్ రిజిస్ట్రార్ డా క్యుమెంట్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నానని.. తనకు న్యాయం చేయాల్సిన అధికారులే.. అక్రమార్కులు, అధికార పార్టీ నాయకులతో కలిసి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంటి నంబర్‌తో డాక్యుమెంట్ చేసేటప్పుడే ఆ ఇంటి నంబర్ ఆన్లైన్లో ఉందా.. లేదా.. అసలు అక్కడ ఇల్లు ఉందా.. దానికి సంబంధించిన ఫొటోలు ఏమైనా ఉన్నాయా.. అని చెక్ చేయకుండా సబ్‌రిజిస్ట్రార్ హద్దుల సవరణ చేస్తూ డాక్యుమెంట్ చే యడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారంటున్నా డు. అసలు ఏం జరిగిందో ఆయన కథనం ప్రకారం..
చెన్నూర్ అంబేద్కర్ కాలనీలో సర్వే నంబర్ 992/ఎ/1బీ1/2 లో బాసింగాల సాయి జయంత్, తండ్రి భద్రయ్య(బాధితుడు) 435.55 చదరపు గజాల భూమిని బొడ్ల శ్రీరాములు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడు. కాగా, ఈ భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్.. బొడ్ల సత్యనారాయణ అనే వ్యక్తిని రంగంలోకి దింపాడు. ఎలాంటి డాక్యుమెంట్లు లేనప్పటికీ.. ఈ భూమిలో ఇల్లు ఉన్నట్లు చెన్నూర్ మున్సిపాలిటీ నుంచి ఓ ఫేక్ ఇంటి నంబర్ తెచ్చుకొని దాని ఆధారంగా బొడ్ల సత్యనారాయణ పేరుమీదకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం దాని ఆధారంగా సదరు వ్యక్తి నుంచి తనకు ఆ భూమిని విక్రయిస్తున్నట్లు ఆ కాంగ్రెస్ లీడర్ మరో డాక్యుమెంట్ తయారు చేశాడు.
ఆపై నేరుగా రంగంలోకి దిగి ఈ భూమి తనదేనంటూ.. ఇక్కడికి నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. దీంతో ఏం జరిగిందా అని బాధితుడు ఆరా తీశాడు. లేని ఇల్లును ఉన్నట్లుగా చూపించి, ఇంటి నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిర్ధారించుకొని మున్సిపాలిటీలో దరఖాస్తు చేశారు. బొడ్ల సత్యనారాయణకు జారీ చేసిన ఇంటి నంబర్ 7-15/1ఏ ఎక్కడ ఉందో చూపించాలని, ఆ ఇల్లు ఉన్న స్థలానికి సంబంధించి యాజమాని సమర్పించిన భూమి హక్కు పత్రాలు కావాలని మున్సిపాలిటీకి బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు.
అక్కడ ఎలాంటి పేపర్లు లేవని, తప్పుదోవ పట్టించి ఫేక్ ఇంటి నంబర్ తీసుకున్నారని మున్సిపాలిటీవారు చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సత్యనారాయణను పిలిపించి మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయో తీసుకురమ్మని అడిగారు. దానికి సదరు వ్యక్తి.. తప్పు జరిగింది.. ఓ కాంగ్రెస్ లీడర్ రూ.80 వేలిస్తే ఇంటి నంబర్ తీసుకొని, దానితో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నాకు అక్కడ ఎలాంటి భూమి లేదంటూ నిజం ఒప్పుకున్నాడు. ఈ వీడియో రికార్డు సైతం పోలీసుల దగ్గర ఉంది. దీంతో పోలీసుల సూచన మేరకు సత్యనారాయణ మున్సిపాలిటీకి పోయి నాకు ఇల్లు లేదు, ఏం లేదు ఇంటి నంబర్ క్యాన్సల్ చేయమని స్వయంగా మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు.
అధికార పార్టీ నాయకుడి ఒత్తిడితోనో.. మరే కారణంతోనో తెలియదు కానీ మున్సిపాల్ అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితుడు నేరుగా కలెక్టర్ కు మార్ దీపక్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పం దించిన కలెక్టర్ ఎంక్వైరీ చేసి, చర్యలు తీసుకోవాలం టూ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మే రకు ఈ ఏడాది మార్చిలో మున్సిపల్ అధికారులు స్వ యంగా వెళ్లి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఎలాంటి ఇల్లు లేదని, అక్రమంగా ఇంటి నంబర్ పొందారని గుర్తించి ఇంటి నంబర్‌ను రద్దు చేయడంతో పాటు ఆన్లైన్ నుంచి తొలగించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మార్చిలో మున్సిపల్ అధికారులు క్యాన్సల్ చేసిన అదే ఇంటి నంబర్‌తో బొడ్ల సత్యనారాయణ హద్దులు మారుస్తూ .. మేలో మరోసారి సదరు కాంగ్రెస్ నాయకుడికి మరో డాక్యుమెంట్ చేయించారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. విషయం తెలుసుకున్న బా ధితుడు భద్రయ్య సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వచ్చాడు.
క్యాన్సలైన ఇంటి నంబర్‌తో డాక్యుమెంట్ ఎలా చేశారని ప్రశ్నించాడు. ఈ విషయం తమకు తెలియదని సబ్‌రిజిస్ట్రార్ చెప్పడంతో ఇంటి నంబర్ మార్చిలో ర ద్దు అయ్యింది. దాని ఆధారంగా మీరు మేలో చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. కలెక్టర్ ఆదేశాలతో సమస్య పరిష్కారమైతే.. ఆ విషయాన్ని మీ దగ్గర దాచి.. తప్పుదోవ పట్టించిన సత్యనారాయణ, సదరు కాంగ్రెస్ నా యకుడిపై చర్యలు తీసుకోండి. ఆ డాక్యుమెంట్‌ను ర ద్దు చేయండి.. అంటూ సబ్ రిజిస్ట్రార్‌ను బాధితుడు కోరాడు. దీనికి సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌ను క్యా న్సల్ చేసే అధికారం తనకు లేదని, ఏమైనా ఉంటే కో ర్టు నుంచి తెచ్చుకోవాలంటూ చేతులు ఎత్తేశారంటూ బాధితుడు వాపోతున్నాడు. ఎవరు చేసిన తప్పుకు.. ఎవరు కోర్టుకెళ్లాలి. కలెక్టర్ డైరెక్షన్ ఇచ్చినా అధికారులు ఇలా వ్యవహరించడం ఏమిటని.. ఇంకా ఎన్ని రోజులు కొట్లాడాలంటూ బాధితుడు వాపోతున్నాడు.
ఈ వ్యవహారం ముందు నుంచి పోలీసులకు తెలు సు. ఈ మేరకు బొడ్ల సత్యనారాయణపై ఎఫ్ఐఆర్ సై తం చేశారు. కానీ, అక్రమార్కుల నుంచి బాధితుడి భూమికి రక్షణ కల్పించడంతో మాత్రం జాప్యం చేస్తున్నారు. తనకు ఇక్కడ ఎలాంటి భూమి లేదని గతం లో పోలీసుల ముందే సత్యనారాయణ నిజం ఒప్పుకున్నాడు. స్వయంగా ఆయనే వెళ్లి మున్సిపాలిటీలో ఈ మేరకు దరఖాస్తు కూడా ఇచ్చాడు. కానీ, ప్రస్తు తం చేసుకున్న హద్దుల సవరణ డాక్యుమెంట్ ఆధారంగా మరోసారి భూమిలోకి వచ్చారంటూ బాధితు డు వాపోతున్నాడు. పదుల మందిని వెంటబెట్టుకొని వచ్చి భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారం టూ ఆరోపిస్తున్నాడు.
ఈ విషయం తెలిసీ కూడా పో లీసులు పట్టించుకోవడం లేదంటున్నాడు. తన భూ మిపై కన్నేసిన కాంగ్రెస్ నాయకుడు మంత్రి వివేక్‌తో సన్నిహితంగా తిరుగుతూ అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు. మంత్రి వివేక్ ఇలాంటి వారిని పక్కనపెట్టుకొని, నాలాంటి మ ధ్య తరగతి వ్యక్తులను ఇబ్బందులు గురి చే స్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా మంత్రి వివేక్, కలెక్టర్ జోక్యం చేసుకొని తప్పుడు రిజిస్ట్రేషన్‌కు కారకులపై చర్యలు తీసుకోవడంతో పాటు, తన భూమిని తనకు అప్పగించాలంటూ బాధితుడు ప్రాధేయపడుతున్నారు. దీనిపై అ ధికారులు ఎలా స్పం దిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.