నిర్మల్ చైన్‌గేట్, ఏప్రిల్ 29 : గర్భిణులు, బాలింతలు 102(అమ్మ వాహనం) అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకుంటున్నారు. 102 నంబర్‌కు ఫోన్ రాగానే.. ఆశ కార్యకర్తలు స్పందించి వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గర్భిణులను జిల్లా, ప్రసూతి దవాఖానలకు తీసుకెళ్తుంటారు. ప్రసూతి అయి పూర్తిగా కోలుకున్న తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చుతున్నారు. తర్వాత కూడా మూడు నెలల వరకు వాహన సేవలు ఉపయోగించుకుంటున్నారు. కాగా.. నిర్మల్ జిల్లాలో ఐదు వాహనాలు ఉండ గా.. ఆరుగురు డ్రైవర్లు పనిచేస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. జనవరి 2023 నుంచి మార్చి 2023 వరకు 6,821 మంది సేవలు వినియోగించుకున్నారు. ఇందులో గర్భిణుల చెకప్ కోసం 6,003 మంది, ఇంటికి చేరేందుకు ప్రసూతి అయిన వారు 691 మంది సేవలు ఉపయోగించుకున్నారు. ప్రసూతి అయిన తర్వాత మూడు నెలల లోపు చెకప్‌నకు వచ్చిన వారు 134 మంది మొత్తం 1,983 సార్లు వాహనాలు ట్రిప్పులు తిరిగాయి.
102 వాహన సేవలు బాగున్నాయి..
నాపేరు అనూష. మాది పెంబి మండలంలోని మందపెల్లి. ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు ఉచితంగా ఏర్పాటు చేసిన 102 వాహన సేవలు సద్వినియోగం చేసుకున్నాం. నన్ను ప్రసూతి కోసం నిర్మల్ ఎంసీహెచ్‌కు వచ్చాను. కోలుకున్న తర్వాత అమ్మ వాహనంలో ఇంటికి చేర్చారు. ప్రైవేటు వాహనాలలో వెళ్తే ఖర్చు బాగా అయ్యేది. గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు లేకుండా102 వాహనం ఏర్పాటు చేయడం సంతోషకరం.
– అనూష, బాలింత, మందపెల్లి, పెంబి మండలం.
సకాలంలో స్పందిస్తాం..
ఫోన్ కాల్ రాగానే సకాలంలో స్పందిస్తాం. ముందుగా గర్భిణులు, బాలింతలు ఆశ కార్యకర్తలకు సమాచారం అందిస్తారు. వారు కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగానే మేము అప్రమత్తమై వాహనం ఏర్పాటు చేస్తాం. కరోనా సమయంలోనూ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందించాం. ఒక్కరికైనా వాహనం ఏర్పాటు చేస్తున్నాం.
– బాలాజీ, జిల్లా రెస్పాన్సిబుల్ అధికారి, నిర్మల్.