బెజ్జూర్/పెంచికల్పేట డిసెంబర్ 22 : హైదరాబాద్ దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 58 మంది ఎఫ్బీవోలు ఆదివారం బెజ్జూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అకాడమీ అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో బెజ్జూర్ రెంజ్, కుశ్నపల్లి సెక్షన్లో పర్యటించి ఇందిర్గాం బీట్లో అటవీ సంరక్షణ చర్యలు, గడ్డి మైదానాల పెంపకంపై తెలుసుకున్నారు.
ఈ ప్రాంతంలో విశేషమైన రాముడు-భీముడు టేకు చెట్టును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శ్రావణ్, ఎఫ్బీవోలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెంచికల్పేట మండలంలోని నందిగాం బీట్ పరిధిలోని పాలరాపు గుట్ట వద్ద రాబంధుల స్థావరాన్ని సందర్శించారు. అంతరించిపోతున్న రాబంధుల సంరక్షణ, అటవీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వో జగన్మోహన్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.