ఆదిలాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : పేదలకు సన్నబియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. వర్షాకాలం నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నది. రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలోని 356 రేషన్ దుకాణాల్లో ఈ నెల 1 నుంచి ప్రారంభంకాగా ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు మూడు నెలల బియ్యం తీసుకున్నారు. దొడ్డుబియ్యం పంపిణీ కారణంగా లబ్ధిదారులు బియ్యం వండి తినకుండా విక్రయిస్తున్నారని, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని ఉపయోగించాల్సిన కార్డుదారులు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని కిలో రూ.12 చొప్పున రేషన్దుకాణాదారులు, దళారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం లక్ష్యం నేరవేరకపోగా దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
భారీగా నిల్వలు స్వాధీనం
ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు శివాజీ చౌక్‌లోని రజిత కిరాణా దుకాణంలో 100 బ్యాగులు, దుకాణం పక్కన ఉన్న గోదాంలో 200 బ్యాగుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దళారులు బియ్యం అక్రమంగా తరలించడానికి కొత్త పన్నాగం ఎన్నుకున్నారు. కిరాణా దుకాణాల్లో లభించే సన్న బియ్యం మాదిరిగా రేషన్ బియ్యాన్ని 25 కిలోల సంచుల్లో ప్యాక్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ప్రత్యేక గోదాంను ఏర్పాటు చేయడంతోపాటు సంచులను కుట్టడానికి ప్రత్యేక మిషన్‌ను వినియోగించారు. దళారులు బియ్యం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు తరలించి కిలో రూ.20 చొప్పున విక్రయిస్తారు. బియ్యం అక్రమ వ్యాపారం వల్ల లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణాలో ముగ్గురు వ్యక్తులను ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రేషన్‌కార్డుదారులు బియ్యం అవసరం లేకుంటే దుకాణాల నుంచి తీసుకోవద్దని, విక్రయించిన వారి కార్డులు రద్దు చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ తెలిపారు.
రేషన్ బియ్యాన్ని పరిశీలించిన ఎస్పీ
పట్టణంలోని శివాజీ చౌక్‌లోని రెండు దుకాణాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఇద్దరు వ్యాపారుల దుకాణాల్లో 326 బ్యాగుల్లో నిల్వ ఉంచిన 79.30 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అక్రమ దందాలో రజిత కిరాణా దుకాణం నిర్వాహకుడు గూగుల్వార్ సంతోష్, ఆంధ్ర కిరాణ ఓనర్ షేక్ అయ్యూబ్‌తో పాటు చిలుకూరి లక్ష్మీనగర్‌కు చెందిన షేక్ అస్లాంలపై కేసు నమోదు చేశామన్నారు. పీడీఎస్ రైస్ విక్రయించే వారిపై సస్పెక్ షీటలు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.