దండేపల్లి, మే 14 : ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెల రోజులైనా కాంటా పెట్టకపోవడంతో అక్కడే జాగారం చేస్తున్నారు. మరోవైపు అప్పుడప్పుడూ వానలు పడుతుండగా, ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో 288 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు దాటుతున్నా, ధాన్యం సేకరణ మాత్రం 50 శాతం కూడా పూర్తి కాలేదు. 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. 20 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉండగా, రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకనుగుణంగా లారీలు సమకూర్చకపోవడం, హ మాలీలను అందుబాటులోకి ఉంచకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వడంలో అధికారులు విఫలం కాగా, రై తులు అద్దెకు తీసుకువచ్చిన కవర్లను కప్పుతున్నారు. కొం దరు రైతులు గత్యంతరం లేక ఫ్లెక్సీలు తెచ్చి కప్పుకుంటున్నారు.
తూకం వేసిన ధాన్యాన్న తరలించడంలోనూ జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల్లో ధాన్యాన్ని దించుకోకపోవడంతో రోజుల తరబడి అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ధాన్యంలో తాలు, తప్ప, విరిగిన నూక వస్తుందనే నెపంతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ దించుకోవడవం లేదు. అసలే లారీలు తక్కువ ఉన్నాయంటే.. దీనికి తోడు మిల్లర్లు వెంటనే దించుకోకపోవడం పెద్ద సమస్యగా మారింది.లారీలు రాక తూకం వేసిన బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి.
ఏడెకరాల్లో వరి వేసిన. కోసి నెల రోజుల కింద ఇక్కడి సెంటర్కు తెచ్చిన. ఇప్పటి వరకు జోకుతలేరు. మూడు రోజుల కింద వానకు కొన్ని వడ్లు తడిసినయి. మొన్నటి వరకు వడ్లు మంచిగా ఎండినయి. జోకుడు ఆలస్యమయ్యేసరికి మస్తు ఇబ్బంది అయితుంది. రోజూ ఎండకు ఎండబెట్టి ఆరబెడుతూ కుప్ప జేసుకుంటున్నం. లారీలు రాక మస్తు పరేషాన్ అయితంది. బస్తాకు రెండు కిలోల కటింగ్ అంటున్నరు. మా గోడును పట్టించుకునే నాథుడే లేడు. -బత్తుల రవి, రైతు, చింతపెల్లి
రెండెకరాల్లో వరి కోసిన. 15 రోజుల కింద వడ్లు ఇక్కడికి తెచ్చిన. అకాల వర్షాలతో ఇబ్బందిగా ఉంది. మొన్నటి వానకు వడ్లు తడిసినయి. తెచ్చిన వెంటనే కాంట పెడితే ఈ బాధలుండవు. వర్షానికి తడవకుండా కవర్లు అద్దెకు తెచ్చుకొని కప్పుకుంటున్నం. జోకుడు అయ్యేదాకా వడ్ల కుప్పకాడనే జాగారం అయితంది. ఓ దిక్కు వర్షాలు భయపెడుతున్నయి. ఇప్పటికైనా వడ్లు తూకం వేయాలె.
-మడావి రఘు, రైతు, కుందేళ్లపహాడ్