ఎదులాపురం, సెప్టెంబర్ 1 : దళిత బంధు పథకం కింద మంజూరైన 249 యూనిట్లను గ్రౌడింగ్ చేశామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులు, జిల్లా స్థాయి కమిటీలు, ఎంపీడీవోలతో దళిత బంధు, దళిత బస్తీ, వోడీఎఫ్ప్లస్, పింఛన్లు, హరితహారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో దళిత బంధు పథకం కింద 249 యూనిట్లకు రూ.24.90 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేసి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో వోడీఎఫ్ ప్లస్ కింద ప్రకటించిన 117 గ్రామ పంచాయతీల్లో మండల బృందాలు పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.
ఈ నెల 5వ తేదీలోగా మొదటి విడుతలోని 64 గ్రామ పంచాయతీల నివేదికలు, మిగతా 53 గ్రామ పంచాయతీల్లో వోడీఎఫ్ప్లస్ పరిశీలన చేసి ఈ నెల 10వ తేదీ నాటికి నివేదికలు అందజేయాలన్నారు. కొత్తగా మంజూరైన 15,474 పింఛన్ల గుర్తింపు కార్డులు ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమం కింద ఇప్పటి వరకు నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైని కలెక్టర్ డాక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేశ్, అటవీ శాఖ అభివృద్ధి అధికారి రాహుల్, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీఏ కిషన్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శంకర్, అదనపు డీఆర్డీఏ రవీందర్ పాల్గొన్నారు.