
నేడు దాఖలు చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్ధి విఠల్ దండే
అనంతరం పార్టీ సమావేశం
హాజరుకానున్న మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్, నవంబర్ 22 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ సందడి నెల కొంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మంగళవారం విఠల్ దండే నామినేషన్ వేయనుండగా, ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరుకాను న్నారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.
జిల్లాలో నామినేషన్ల సందడి కనిపించనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల దాఖలుకు మంగళవారమే ఆఖరు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విఠల్ దండే నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆదిలాబాద్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. అనంతరం పట్టణ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి విఠల్ దండే, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్లు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యనాయకులు ఈ ఎన్నికల్లో ఓటు వేసే ప్రజాప్రతినిధులు సమావేశానికి రావాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 942 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 70 శాతం మంది టీఆర్ఎస్కు చెందిన వారున్నారు. కాగా.. సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రతినిధులు, నాయకులకు పలు సూచనలు చేయనున్నారు.
రెండు నామినేషన్లు దాఖలు
ఎదులాపురం, నవంబర్ 22 : ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి సోమవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామానికి చెందిన గుండవరపు హరిణి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జన్నారం మండల కేంద్రానికి చెందిన మహ్మద్ రియాజుద్దీన్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. నామినేషన్ స్వీకరించిన అనంతరం ఆయా అభ్యర్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
నామినేషన్‌కు తరలి రావాలి : ఎమ్మెల్యే బాపురావ్
బోథ్, నవంబర్ 22 : ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమానికి బోథ్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు తరలి రావాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌లోని తనీషా గార్డెన్లో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. తొమ్మిది మండలాల పరిధిలోని పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ, సొసైటీ, ఆత్మ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు హాజరు కావాలని సూచించారు.
మంత్రి అల్లోలను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి
రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆయన.. ఐకేరెడ్డికి పూల మొక్కను అందించారు. పార్టీ అధిష్టానం దండె విఠల్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ఆయన వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.