
అడవిలో తిరుగుతూ లెక్కించనున్న బీట్ అధికారులు
ట్రయల్స్,ట్రాంజెక్ట్స్గా విభజన
మొదట మాంసాహార, తర్వాత శాకాహార ప్రాణుల లెక్కింపు
ఉట్నూర్ రూరల్, నవంబర్ 22 :ఆదిలాబాద్ జిల్లాలో జంతుగణన కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. అటవీ శాఖ అధికారులు మూడేళ్లకోసారి ఈ లెక్కింపు చేపడుతుండగా, ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మొదటి మూడు రోజులు మాంసాహార, మరో మూడు రోజులు శాకాహార జంతువులను లెక్కించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, భీంపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో అధికారులు లెక్కింపు షురూ చేశారు.
‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. వారం రోజుల పాటు కొనసాగనుంది. అటవీ అధికారులు ప్రతి మూడేళ్లకోసారి అడవి జంతువుల గణన చేయనున్నారు. ఈ విధానం గతంలో ఐదేళ్లకోసారి జరిగేది. ప్రస్తుత పరిస్థితుల్లో వన్య ప్రాణులను రక్షించేందుకు మూడేండ్లకు తగ్గించారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు ఈ లెక్కింపు సాగనుంది. ఇందుకోసం ఉన్నతాధికారులు డివిజన్ స్థాయి అటవీ శాఖ కార్యాలయాలలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక్కో బీట్ అధికారి సుమారు వారం రోజుల పాటు 20 కిలోమీటర్లు కాలి నడకన తిరుగుతూ శాఖాహార, మాంసాహార జంతువులను లెక్కించనున్నారు.
సర్వే సాగుతుందిలా..
వన్యప్రాణుల లెక్కింపులో భాగంగా అటవీ బీట్ అధికారులు ఉదయం ఆరు గంటలకే సర్వే కోసం అడవిలోకి వెళ్తారు. సర్వే ప్రారంభానికి ముందు ఫొటో తీసుకుంటారు. బీట్ అధికారి వెంట ఒక హెల్పర్ ఉంటారు. వారి వెంట ఆత్మ రక్షణకు ఒక లాఠీ, గొడ్డలి తప్పనిసరిగా తీసుకెళ్తారు. సహాయానికి వచ్చిన వ్యక్తి కచ్చితంగా చుట్టుపక్కల ప్రదేశాలను గమనిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి ఏ ఆపద వచ్చినా పసిగట్టి అలర్ట్ చేస్తాడు. గణనకు వెళ్లిన వారి మొబైల్ ఎప్పుడూ ఫుల్ ఛార్జింగ్‌లో ఉంచుకోవాలి. అల్పాహారం తీసుకొని వెళ్తారు.
ఆరు రోజులు పాటు లెక్కింపు..
మొదటి మూడు రోజులు వారి బీట్లలో ప్రతి రోజూ 5 కిలోమీటర్ల చొప్పున 15 కిలోమీటర్లు పర్యటిస్తారు. మాంసాహార జంతువులను లెక్కిస్తారు. మిగిలిన మూడు రోజులు శాకాహార జంతువులను గణిస్తారు. ఈ లెక్కింపు ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్’ పేరుతో చేస్తారు. ఇందులో ట్రయల్స్, ట్రాంజెక్ట్స్ అనే రెండు విధాలుగా లెక్కింపు చేపడుతారు. డైరెక్ట్‌గా కనిపించిన జంతువులను ట్రయల్స్ అని, ఇన్‌డైరెక్ట్‌గా గుర్తించడాన్ని ట్రాంజెక్ట్స్ అంటారు. ఇలా సేకరించిన వివరాలను ప్రత్యేంగా ఏర్పాటు చేసిన యాప్‌లో అప్లోడ్ చేస్తారు. జంతువుల పాదముద్రలు, వెంట్రుకలు, మలం సేకరించి వాటి ద్వారా జంతువు, దాని వయస్సు నిర్ధారిస్తారు. ఆ వివరాలనూ యాప్‌లో నమోదు చేస్తారు.
ధనోరా సెక్షన్లో ప్రారంభం
భీంపూర్, నవంబర్22: భీంపూర్ మండలం ధనోరా సెక్షన్ పరిధిలో సోమవారం జంతుగణన మొదలైంది. ఈ గణన 28 వరకు కొనసాగుతుందని ఎఫ్ఎస్వో గులాబ్ తెలిపారు. ఈ గణన ద్వారా శాఖాహార , మాంసాహార జంతువుల సంఖ్య దాదాపుగా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. గణనలో ఎఫ్‌బీవోలు కేశవ్, గోపాల్, ఎనిమల్ ట్రాకర్స్ సోనేరావు, జంగు ఉన్నారు.