
ముస్తాబైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం
ఈ నెల 24న రథోత్సవం..
ఐదు రోజుల పాటు జరుగనున్న వేడుక
ఏర్పాట్లు పూర్తి చేసిన పాలకమండలి
జైనథ్, నవంబర్ 22 : ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతరకు వేళైంది. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పాలకమండలి సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఆలయం ప్రాచీన కళలకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఆలయ ఉన్నతశిఖరం కలిగి శిల్పకళలతో శోభితమై ఉన్నది. ప్రతి ఏటాలాగే ఈ నెల 24 నుంచి అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లలో పాలకమండలి సభ్యులు నిమగ్నమయ్యారు.
ఆలయ చరిత్ర..: ప్రాచీనకళలకు జైనథ్ శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారని చరిత్ర చెబుతున్నది. స్వామివారి పాదాలను సూర్యకిరణాలు సంవత్సరంలో నాలుగుసార్లు తగలడం ఈ ఆలయ విశిష్టతల్లో ప్రత్యేకమైనది. దీంతో స్వామివారిని సూర్యనారాయణ స్వామిగా పిలుస్తారు. 11, 13వ శతాబ్దాల్లో మహారాష్ట్రలోని వేవత్మాలపంత్ అనే నల్లరాతితో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయం ముందుభాగాన పెద్ద జలాశయం(కోనేరు) ఉంది. నేడు అది చెరువుగా రూపాంతరం చెందింది.
విశిష్టత..: ఆలయం 60 చదరపు గజాల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో అష్టకోణాకార మండపంపైనున్న గర్భగుడిలో సూర్యనారాయణ స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. విగ్రహం దక్షిణ దిశలో లక్ష్మీదేవి, అళ్వారులు, అన్యదేవత మూర్తులున్నాయి. మండలం అంతర్భాగాన స్తంభంపై హనుమంతుడు, రంబాధి అప్సరసల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయం ఇరువైపులా శృంగార చిత్రాలు కనిపిస్తాయి.
ప్రత్యేకతలు..: సంతానం లేని వారు భక్తితో స్వామివారి కళ్యాణోత్సవం రోజున(గరుడముద్ద) స్వీకరిస్తే సంతానప్రాప్తి జరుగునని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున నాగవెళ్లి కార్యక్రమంలో సైతం స్వామివారిని ధ్యానిస్తూ పూలదండ ధరిస్తే కూడా తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతారు. కార్తికమాసంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు. వందలాది జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
బ్రహ్మోత్సవాలు..: కార్తీకమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. కార్తిక ఏకాదశి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ద్వాదశి రోజున స్వామివారి కల్యాణం, బహుళ పంచమిరోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్కనున్న మహారాష్ట్రనుంచి కూడా వేలసంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.