
రైతులకు సకాలంలో క్రాఫ్ లోన్ మంజూరుచేయాలి
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్యాంకర్లతో సమావేశం
ఎదులాపురం, నవంబర్ 22 : లక్ష్యానికి అనుగుణంగా రైతులకు పంట రుణాలను మంజూరుచేయాలని బ్యాంకర్లకు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సెప్టెంబర్ నెలాఖరు బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.198.86 కోట్ల లక్ష్యం కాగా, రూ.101.61 కోట్ల రుణాలు మాత్రమే సెప్టెంబర్ నెలవరకు అందించారని తెలిపారు. వ్యవసాయ రుణాలు, వ్యవసాయ, సంబంధ రుణాలు, పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం, ఉపాధి, బ్యాంక్ లింకేజీ వంటి రుణాలు ఆయా బ్యాంకులు ఎక్కువ మొత్తంలో సంబంధిత శాఖల అధికారుల సమస్వయంతో మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనపై నిరుద్యోగ యువతకు అవగాన కల్పించి, అవసరమైన శిక్షణ ఇప్పించి రుణాలు అందించాలని సూచించారు. ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజీ కింద రూ.198.89 కోట్లు రుణాలు అందించాల్సి ఉండగా, రూ.109.94 కోట్లు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. వచ్చే నెల లక్ష్యాలను సాధించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. బ్యాంక్ లింకేజీ రూ.12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.7 కోట్లు మాత్రమే చెల్లించవలసి ఉందన్నారు.
బ్యాంక్ రుణపరిమితిని పెంచాలని తెలిపారు. అదిలాబాద్ పట్టణ బ్యాంక్ లింకేజీ రూ.98.16 శాతం సాధించి, దేశంలోనే 5వ స్థానంలో నిలిచామని తెలిపారు. ఆ తర్వాత జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ.. మహిళా మహోత్సవ్ కార్యక్రమాలను అన్ని బ్యాంకుల్లో నిర్వహించి, మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్యాంకర్లు సహకరించాలని తెలిపారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పద్మభూషణ్రాజు మాట్లాడుతూ.. స్థానిక డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమలను నెలకొల్పేందుకు యువత ముందుకురావాలని, బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు. అనంతరం 2022-23 పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రంగారావు, ఆర్పీఐ ఏజీఎం తేజ్ దీప్బెహరా, జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి, డీపీఎం శోభ, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.