
పాఠశాల గోడలపై పటాలు, పాఠ్యాంశాలు, సమాచార అంశాలు..
కర్షకుడి కుంచె నుంచి జాలువారుతున్న అద్బుతాలు
చిత్రలేఖనంపై విద్యార్థులకు జిజ్ఞాస పెంపొందిస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయుడు
ఇచ్చోడ, ఆగస్టు 22 : ఆ పాఠశాలలోని గోడలు వివిధ పటాలు, పాఠ్యాంశాలు, సమాచార అంశాలతో నిండి ఉంటాయి. ఏ తరగతి గోడలపైన చూసినా ఆకట్టుకునే కళారూపాలు, మహనీయుల చిత్రపటాలు, సూక్తులు దర్శనమిస్తుంటాయి. ఇలా చిత్రలేఖనంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇక్కడి తాత్కాలిక ఉపాధ్యాయుడు కదం ప్రకాశ్.
మండలంలోని దుబార్పేట్ గ్రామానికి చెందిన కదం ప్రకాశ్‌కు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే మక్కువ. ఇంటర్మీడియట్ తరువాత చిత్రలేఖనంలో హైయర్ టీటీసీ ప్రత్యేక కోర్సు చేశాడు. క్రమేనా బ్యానర్లు, చిత్రాలకు అవకాశం తగ్గిపోతుండడతో 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. నేర్చుకున్న విద్య ఎన్నటికైనా ఉపాధి కల్పించకపోతుందా.. అంటూ అప్పుడప్పుడు వచ్చిన గిరాకీతో చిత్రాలు గీసేవాడు. ఐదేండ్ల క్రితం ఇచ్చోడ జడ్పీ సెకండరీ పాఠశాలలో చిత్రలేఖనంపై తాత్కాలిక ఉపాధ్యాయుడు కావాలనీ ప్రకటన రావడంతో బాధ్యతలను చేపట్టాడు. అరక పట్టిన కర్షకుడి కలం నేడు అద్భుతమైన చిత్రాలు గీస్తూ ఆకట్టుకుంటున్నది.
ఆకర్షణీయంగా మహనీయుల చిత్రాలు..
పాఠశాలలోని ప్రతి గోడపై మహనీయుల చిత్రాలతో పాటు ఆ గదికి వారి పేరును నామకరణం చేశారు. చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ, తెలంగాణ తల్లి, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, వివేకానందుడు, భరతమాత, అబ్దుల్ కలాం, కుమ్రం భీం, మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోశ్, చంద్రశేఖర్ ఆజాద్, తదితరుల చిత్రాలను తన కుంచెతో అందంగా గీశాడు. పాఠశాల ఆవరణలోని ప్రహరీపై ఆలోచింపజేసే సూక్తులు, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్గించే చిత్రాలు గీసి అబ్బురపరుస్తున్నాడు.
అందరి సహకారంతోనే…
ఇచ్చోడ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతోనే రాణిస్తున్నా. చిత్ర లేఖనంపై విద్యార్థుల్లో మేధాశక్తి, ఆచోచనా విధానాన్ని పెంపొందిస్తున్నాను. వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కృషి చేస్తున్నా. గతంలో 20 ఏళ్లుగా వ్యవసాయం చేశాను. కళా రంగంలో నేర్చుకున్న విద్యను విద్యార్థులకు నేర్పుతూ వారితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.