
మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ నుంచి రాక
ఇంటిల్లిపాదికి ఇక్కడే ఉపాధి
వరి నాట్ల నుంచి పత్తి ఏరేదాకా..
ఆరునెలల పాటు చేతినిండా పని
సర్కారు పథకాలతో జిల్లాలో మారిన ఎవుసం
రెండు సీజన్లలో సమృద్ధిగా పంటల సాగు
ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, నవంబర్ 20 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వలసకూలీలకు జీవనభరోసానిస్తున్నది. రాష్ట్ర సర్కారు చేపట్టిన పథకాలతో ఈ ప్రాంతంలో ఎవుసం పండుగలా సాగుతుండగా, పంటల దిగుబడి అంతకంతకూ పెరుగుతున్నది. సాగు నీరు సరిపడా అందుతుండగా, రెండు పంటలకూ ఢోకా లేకుండా పోతున్నది. దీంతో ఆయా రాష్ర్టాల్లో పనుల్లేక కుటుంబ పోషణకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఏపీ నుంచి ఇక్కడికి వస్తున్న కూలీలను అమ్మలా ఆదుకుంటున్నది. నాట్ల నుంచి దిగుబడి బస్తాల మోత దాకా.. ఇక్కడ వారికి పనులు లభిస్తుండగా, ఆయా కుటుంబాలకు బతుకుదెరువు లభిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో పనులు దొరకక వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. కరీంనగర్, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే పరిస్థితి. మరో వైపు ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటేనే భయపడేవారు. విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ సమస్య తీవ్రంగా వేధించింది. పంట పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. కష్టపడి సాగుచేసిన పంటలను కొనుగోలు చేసేవారు లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో జిల్లాలో సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరిగింది. రైతులు వానకాలం, యాసంగి పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం, మిషన్ కాకతీయ, విత్తనాలు, ఎరువుల పంపిణీ, 24 గంటల ఉచిత విద్యుత్ వంటివి రైతులకు అండగా నిలిచాయి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను సర్కారు కొనుగోలు చేస్తున్నది. ఈ ఏడాది వానకాలంలో రైతులు 18 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు కూడా గ్రామాలకు తిరిగివచ్చి వ్యవసాయం చేసుకుంటూ బాగా సంపాదిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రెండు సీజన్లలో పత్తి, వరి, సోయాబిన్, కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము పంటలు పండిస్తారు.
8 వేల మందికి ఉపాధి
ఉమ్మడి జిల్లాలో మన కూలీలతో పాటు సుమారు 8 వేల మంది వలస కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. పంటను కోయడం, సంచుల్లో నింపడం, మార్కెట్‌కు తరలించడం లాంటి పనులతో కూలీలకు ఉపాధి లభిస్తున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఏపీకి చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. వానకాలంలో పత్తి, సోయాబిన్, వరి కంది, యాసంగిలో మక్క, వరి జొన్న పంటలను రైతులు సాగుచేస్తారు. పంట దిగుబడి దశకు చేరుకోగానే కోతలు, తూకం, లారీల్లో లోడ్ చేయడం కోసం కూలీలు అవసరమవుతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలు సాగు విస్తీర్ణం క్రమంగా పెరగడం, దిగుబడులు బాగా పెరిగాయి. . పంటలను సరైన సమయంలో తీయడం, మార్కెట్‌కు తరలించడం కోసం రైతులు బిహార్ రాష్ర్టానికి చెందిన కూలీలను సంప్రదించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లుగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కూలీల సంఖ్య బాగా పెరిగింది.
గిట్టుబాటు కూలి
ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీరు తమ రాష్ర్టాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూలీలు ఎక్కువగా పత్తి పంటను తీయడానికి వస్తారు. బిహార్ కూలీలు సోయాబీన్, వరి ఇతర పంటలను మార్కెట్‌కు తరలించడం లాంటి పనులు చేస్తారు. అక్టోబర్‌లో ఆయా ప్రాంతాల నుంచి రైళ్లలో జిల్లాకు చేరుకుంటారు. ఈ నెలలో సోయాబీన్ పంట కోతలు ప్రారంభం కాగానే గ్రామాలకు చేరుకొని పనుల్లో నిమగ్నమవుతారు. తర్వాత మక్క, వరి కోతలకు సంబంధించిన పనులు చేస్తారు. 10 నుంచి 12 మంది కూలీలు గ్రామాల్లోనే పంట తీయడం పూర్తయ్యేవరకు ఉంటారు. రెండు సీజన్ల మధ్య పంట దిగుబడులకు సమయం ఉన్నప్పుడు రైస్ మిల్లుల్లో బస్తాలు మోయడం లాంటి పనులు చేస్తారు. రైతులు పత్తిచెట్టు నుంచి దూది తీసినందుకు కిలోకు రూ. 8 నుంచి రూ.10 చొప్పున, వడ్ల సంచులను తూకం వేసి లారీలో లోడ్ చేసినందుకు క్వింటాల్‌కు రూ.35 చొప్పున, సోయా, మక్క పంటలకు క్వింటాల్‌కు రూ.30 చొప్పున రైతులు చెల్లిస్తారు. మహారాష్ట్ర కూలీలకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలలు, బిహార్ కూలీలకు అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు ఆరునెలలకు పైగా ఉపాధి లభిస్తుంది. ఒక్కొక్కరికీ రోజుకు రూ.600 నుంచి రూ. 800 వరకు కూలి లభిస్తుంది.
ఇక్కడే ఉపాధి..
నిర్మల్ టౌన్, నవంబర్ 20: మాది పంజాబ్ రాష్ట్రంలోని పుజల్గాం గ్రామం. మా ప్రాంతంలో వరి పంటే ఎక్కువ. అక్కడ హార్వెస్టర్ల ద్వారా వరి కోత కోసం డ్రైవర్‌గా పని చేస్తే సీజన్‌కు రూ. 30వేలు ఇస్తరు. అదే పని ఇక్కడ చేస్తే నెలకు రూ. 40వేలు ఇస్తారు. రెండు నెలల పాటు డ్రైవర్‌గా పని చేసేందుకు ఇక్కడికి వచ్చిన. కుటుంబానికి దూరంగా ఉండడం కొంత ఇబ్బందే. కానీ ఈ రెండు నెలల పాటు కష్టపడితే రూ. 80 వేలు వస్తయి. ఇందులో రూ. 20వేలు ఖర్చులకు పోతే రూ. 60వేలు మిగులుతయి. ఇక్కడ 24 గంటల కరంటు ఇవ్వడం వల్ల అక్టోబర్ నుంచి మే వరకు ఏదో ఒక పంట కోతకు రావడంతో పని దొరుకుతోంది. -జశ్వేందర్సింగ్, పంజాబ్ డ్రైవర్
పిల్లాజెల్ల కలిసి వచ్చినం..
నెన్నెల, నవంబర్ 20: పని కోసం చంటి పిల్లలతో కలిసి వచ్చినం. మా ప్రాంతంలో సరైన పనుల్లేవు. ఉన్నా అవి ఒకరిద్దరికే దొరుకుతయి. కుటుంబాన్ని పోషించుకు నేంతా కూలి మాత్రం దొరకడం లేదు. యేటా పత్తి తీయడానికి వస్తున్నం. మూడు నెలల పాటు అక్కడ ఇండ్లకు తాళం వేసి ఇక్కడే ఉంటం. ఎండావాన అనకుండా కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నం. మాకు తెలిసిన పని కాబట్టి, ఏడికి పోయిన బతుకుతం. ఈ ప్రాంతంలో కూలి మంచిగ ఇస్తరు కాబట్టి ఈడికి వస్తున్నం. ఈ ప్రాంతంలో ఇప్పుడు పంటలు బాగా పండుతున్నయి కాబట్టి పనులు కూడా మంచిగ దొరుకుతున్నయి. -సంజమ్మ( బలుకూరు, కర్నూలు జిల్లా)
పత్తి తీయడానికి వచ్చినం..
నెన్నెల, నవంబర్ 20: కర్నూలు జిల్లా వర్లపాడు నుంచి ఇక్కడికి పత్తి తీయడానికి వచ్చినం. రోజూ ఇద్దరం కలిసి క్వింటాల్ పైన పత్తి తీస్తం. కిలోకు రూ.పది ఇస్తున్నరు. తెల్లవారు జామున లేచి వంట చేసుకొని, భోజనం పట్టుకుని ఆరు గంటలకు చేల్లకు పోతం. మధ్యాహ్నం చేల్లకాడ్నె బువ్వ తింటం. తిరిగి సాయంత్రం ఆరు వరకు పత్తి తీస్తం. ఇలా చేస్తే మాకు నాలుగు నుంచి ఐదు వందలు కూలి పడతది. ఒక్కో రోజు రెండు వందలు కూడా పడదు. అయినా ఇంత దూరం వచ్చి ఖాళీగా ఉండలేం. ఏదోటి చేసుకుంటం. అక్కడ మాకు పని లేకనే ఇంత దూరం వచ్చినం.
రెండు పంటలు పండించడంతోనే..
సోన్, నవంబర్ 20: ఇక్కడ రైతులు ఏడాదిలో రెండు పంటలు పండిస్తరు. దీంతో మాకు ఏడాది పొడవునా పనులు దొరుకుతున్నయి. పది మందిమి అక్కడి నుంచి వచ్చి సోన్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో కూలి పనులు చేస్తున్నం. వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం చేసి లారీల్లో లోడింగ్ చేసి పంపిస్తున్నం. రైతులు క్వింటాల్‌కు రూ.40 చొప్పున ఇస్తున్నరు. మా ప్రాంతంల కంటే ఇక్కడే పనులు మంచిగ దొరుకుతున్నయి. ఇక్కడ సర్కారు ఇస్తున్న సౌలతులతో పంటలు మంచిగ పండుతున్నయి.