నిరుద్యోగుల నుంచి రూ. 2లక్షలు వసూలు
నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడించిన డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి
గర్మిళ్ల, ఆగస్టు 20 : పోలీస్ ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన మోసగాడిని మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ పంచాయతీ గుడిపేటకు చెందిన బూక్య తిరుపతి సెంట్రల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తానని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసి జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మౌనికతో పాటు మరి కొంత మంది నిరుద్యోగ యువతులు తిరుపతిని సంప్రదించారు. వారికి రన్నింగ్ టెస్ట్ పెట్టి శిక్షణకు ఎంపిక చేశారు. వారికి కోచింగ్ ఇవ్వడానికి హాస్టల్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఫ్యాకల్టీని పెట్టి వాళ్లను కూడా నమ్మించాడు. స్టూడెంట్స్‌కి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సేఫ్టీ ఉమెన్ వింగ్‌లో ఉద్యోగాలు పెట్టిస్తానని జాబ్‌కు రూ.25 వేలు, అప్లికేషన్‌కు రూ.500, మొత్తం రూ.25,500 అవుతుందని చెప్పి 10 మంది నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశాడు. స్టూడెంట్స్‌కి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సేఫ్టీ ఉమెన్ వింగ్‌లో ఉద్యోగాలు వచ్చినట్టుగా స్వాతి లక్రా ఐపీఎస్ పేరిట నకిలీ పత్రాన్ని సృష్టించి అభ్యర్థులకు అంజేశాడు. మౌనికకు అనుమానం వచ్చి నెల 18న మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో భూక్యా తిరుపతిని పట్టుకున్నారు. అతని నుంచి సెల్ ఫోన్, బాధితులకు తయారు చేసి ఇచ్చిన నకిలీ రిసిప్ట్లు, జాబ్ వచ్చినట్లు ఇచ్చిన నకిలీ సర్టిఫికెట్లు, రూ.58 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ సీఐ బీ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ సీఐ ఏ మహేందర్, మంచిర్యాల ఎస్ఐ కిరణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంపత్ పాల్గొన్నారు.