కిడ్నీవ్యాధితో మంచంపట్టిన బాలుడు
ఆపరేషన్ కోసం రూ.4 లక్షలు అవసరం
దాతల సహాయం కోసం ఎదురుచూపు
ఆసిఫాబాద్, ఆగస్టు 20 :ఆ బాలుడికి 14 ఏండ్లే.. ఒక్కడే కొడుకు.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అనుకోకుండా చిన్నతనంలోనే నడుములో తీవ్రమైన నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే కిడ్నీలో రాళ్లున్నాయని నిర్ధారించారు. తగ్గేందుకు మందులివ్వడంతో ఆరోగ్యవంతుడయ్యాడు. మళ్లీ ఇటీవల కిడ్నీల్లో నొప్పితీవ్రం కావడంతో డాక్టర్ వద్దకు వెళ్లారు. కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఆపరేషన్ చేయాలని, రూ.4 లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కాడితే డొక్కాడని ఆ తల్లి అప్పోసప్పో చేసి ఇప్పటిదాకా రూ.60 వేలు ఖర్చు చేసి వైద్యం అందించింది. కొడుకుకు ఆపరేషన్ చేయించి బతికించుకునేందుకు దాతల సహాయం కోరుతున్నది.
మండలంలోని చిర్రకంట (వట్టివాగు కాలనీ)కు చెందిన కార్తీక్‌కు 14 సంవత్సరాలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి తల్లి లక్ష్మి అన్నీ తానై ముగ్గురు కూతుళ్లు, బాలుడు కార్తీక్‌ను చూసుకుంటున్నది. కూలీ పనిచేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి వారిది. కార్తీక్‌కు చిన్నతనంలో నడుమునొప్పితో బాధపడుతుండగా, డాక్టర్‌ను కలిశారు. కిడ్నీల్లో రాళ్లున్నాయని తేల్చారు. మందులు వాడితే నయమైంది. మళ్లీ ఇటీవల నడుములో విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిశారు. పరీక్షలు నిర్వహించగా.. కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ కచ్చితంగా చేయాలని, ఇందుకోసం రూ.4 లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతున్నది. కొడుకును బతికించుకునేందుకు అప్పోసప్పో చేసి ఇప్పటిదాకా రూ.60 వేలు ఖర్చుచేసింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న బాలుడి శస్త్రచికిత్సకు దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్నది. ఆపరేషన్ కోసం మానవతా దృక్పధంతో పెద్ద మనస్సు చేసుకొని తోచినంత ఆర్థిక సహాయం చేయాలని అర్థిస్తున్నది. దాతలెవరైనా 91005 32404 (నాగలక్ష్మి) నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించి నిండు ప్రాణాన్ని కాపాడాలని కోరుతున్నది.