
వ్యవసాయ చట్టాల రద్దుతో అన్నదాతకు మేలు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 15నెలలుగా రైతులు చేస్తున్న పోరాటానికి ప్రధాన మంత్రి మోదీ దిగివచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేసిన మహా ధర్నాతో దక్షిణాది రాష్ర్టాల్లోనూ ఈ చట్టాలపై నిరసనలు ప్రారంభం కావడంతో కేంద్రం ఉపసంహరణకు ముందుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యాన్ని మొత్తం సేకరించాలన్నారు. అప్పటి వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఫసల్ బీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతోనే కేంద్రం విడుదల చేసిందని, వీటిపై స్థానిక బీజేపీ నాయకులు సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు రాజేశ్వర్, సెవ్వ జగదీశ్, గంగారెడ్డి పాల్గొన్నారు.