
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నదీ స్నానాలు..ప్రత్యేక పూజలు.. వ్రతాలు
దండేపల్లి, నవంబర్19:ఉసిరి స్నానాలు, తులసీ పూజలు, వ్రతాలు, దీపోత్సవాలతో కార్తీక పున్నం వేడుకలు శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కనుల పండువగా సాగాయి. ప్రత్యేక పూజల కోసం వచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. నదులు, వాగుల్లో పుణ్యస్నానాలు ఆచరించి ఉసిరి కొమ్మలను తులసి కోటలో ప్రతిష్ఠించి దీపాలు వెలిగించారు. పలుచోట్ల ప్రముఖులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. బాసర గోదావరి వద్ద నిత్య హారతి కార్యక్రమం వేద పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో శోభాయమానంగా సాగింది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి గాంచిన గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, సైకత లింగాలు, గంగమ్మతల్లికి భక్తులు పూజలు చేశారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. దేవస్థానంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు దంపతులు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌తో పాటు, మహారాష్ట్ర నుంచి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారు. ఆర్టీసీ, వైద్య, పోలీస్, తదితర ప్రభుత్వ శాఖల సిబ్బంది భక్తులకు సేవలందించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో..
మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 19: మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వనాథ ఆలయం, గోదావరి రోడ్డు లో గల గౌతమేశ్వరుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇండ్లల్లోని తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించారు. గోదావరిలో పసుపుతో గౌరమ్మను చేసి గోదావరిలో వదిలారు. సమీపంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాతమంచిర్యాలలోని శ్రీరామాలయం శివాలయం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.