విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రంగయ్య
ఉట్నూర్, ఆగస్టు19 : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వంగా ఉందని, ఇది తనపై మరింత బాధ్యతను పెంచిందని అంటున్నారు అవార్డు గ్రహీత కడెర్ల రంగయ్య. ఉట్నూర్‌కు చెందిన రంగయ్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. 2010లో నిర్వహించిన డీఎస్సీలో ఉద్యోగం సంపాదించిన ఆయన.. అప్పటి నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ్ గ్రామంలోని పాఠశాలలో పనిచేస్తున్నారు. తన నిస్వార్థ బోధనతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు తల్లిదండ్రుల మన్ననలు పొందారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల బోధన చేస్తూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులను తయారుచేశారు. ప్రభుత్వ పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థులున్న సమయంలో ఏకంగా 281 మంది చేరేలా ప్రోత్సహించారు. గ్రామంలో చదువు చెబుతున్న తీరును పరిశీలించిన తల్లిదండ్రులు మండలకేంద్రం నుంచి తమ విద్యార్థులను ఈ పాఠశాలకు పంపేలా చేసిన ఘనత ఆయనది. ఆయన సేవలు మెచ్చిన ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావడంపై మీ స్పందన?
నాకు జాతీయస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడూ అవార్డుల కోసం పనిచేయలేదు. మారుమూల గ్రామంలో విద్యార్థులకు మంచి విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేశా. నేను ఉపాధ్యాయుడిగా చేరినప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నా.
విద్యార్థులను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు?
మా పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశానికి సేవచేసే స్థాయికి ఎదగాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి స్థాయికి వెళ్లాలన్నది నా కోరిక. మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థులు ఆ స్థాయికి వెళ్లడం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధిస్తారు. పుట్టిన ప్రాంతాలకు సేవ చేయడం ద్వారా మరింత మందికి లబ్ధి చేకూర్చిన వారవుతారు.
పాఠశాలకు ఎన్ని గ్రామాల విద్యార్థులు వస్తారు?
మా పాఠశాలకు కెరమెరి మండల కేంద్రం నుంచి కూడా విద్యార్థులు వస్తారు. మండలంలోని ఆడ, గోయగాం, కొలాంకొఠిరి, చిన్నసామర్ఖేడ్, ధనోరా, పార్ఢ, సర్ధాపూర్, కెరమెరి, రింగన్ఘాత్, ఇందావూర్ గ్రామాల నుంచి ప్రతిరోజూ పిల్లలు వస్తారు. మొత్తం 281 మంది చదువుకుంటున్నారు.
మీ పాఠశాల ప్రత్యేకత ఏమిటి?
మాది ప్రభుత్వ పాఠశాలే.. కానీ విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి ఆంగ్ల బోధన ప్రారంభించాం. గ్రామస్తుల చేయూతతో పెయింటింగ్, కంప్యూటర్ల ఏర్పాటు లాంటి సౌకర్యాలు కల్పించాం. వాటి ద్వారా సులభమైన పద్ధతిలో బోధన చేస్తున్నాం. అందుకే ఈ పాఠశాలకు మండలంలోని ఆయా గ్రామాల నుంచి వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అవార్డు ఎప్పుడు వచ్చింది?
నేను ఈ పాఠశాలలో 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. నా బోధన తీరుతెన్నులు, బోధనా పద్ధతుల్లో అనుసరిస్తున్న చర్యలను అందరూ గమనిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి నేను కృషిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడి అ వార్డు అందించింది. ఆ అవార్డుతో మరింత కష్టపడి పనిచేస్తున్నా.
రాష్ట్రం నుంచి ఎంత మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు?
జాతీయ అవార్డుకు రాష్ట్రం నుంచి సుమారు వంద మందిని ఎంపికచేశారు. అందులో నేను ఉండడం ఆనందంగా ఉంది. జిల్లా నుంచి ముగ్గురి చొప్పున, రాష్ట్రం నుంచి సుమారు 100 మంది వరకు ఈ వార్డు కోసం పోటీపడ్డారు. అందులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించారు. అందులో నా పేరుండడం గర్వంగా ఉంది.
ప్రభుత్వ పాఠశాలలో ఏఏ సౌకర్యాలు మెరుగుపర్చాలి?
ప్రస్తుతం పాఠశాలలో అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆంగ్ల బోధనతో పాటు కంప్యూటర్ బోధన చేస్తున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే మౌలిక సదుపాయాలు తప్పనిసరి. అప్పుడే విద్యార్థులు శ్రద్ధపెట్టి పాఠాలు వింటారు. మంచి మార్కులు సాధిస్తారు. బోధన ప్రైవేట్‌కు దీటుగా ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
మీ పాఠశాలకు ఇంకేం కావాలి?
మాది ప్రాథమిక పాఠశాల. ఇందులో మా విద్యార్థులకు ఆంగ్ల బోధన అందించాం. అయితే 5వ తరగతి చదివిన అనంతరం ఏ పాఠశాలలో చేరాలన్నది విద్యార్థులకు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమ బోధననే ఉంది కదా. కావున మా పాఠశాలను పదో తరగతి వరకు ఆప్‌గ్రేడ్ చేయాలి. అప్పుడే విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమ విద్య అందుతుంది. పోటీ పరీక్షలను సైతం తట్టుకుంటారు.
ఈ అవార్డు రావడం వెనుక..?
నాకు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం వెనుక నా కృషితో పాటు విద్యార్థుల శ్రమ కూడా ఉంది. నేను బోధిస్తున్న విధానం వారికి నచ్బబట్టే ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. నేను చూపిన ఆసక్తికి తగ్గట్లు వారు చదివారు. దీనికి కుటుంబం కూడా సపోర్టు ఇచ్చింది.