ఎంపికైన 1,404 మంది విద్యార్థులు
సీట్లు సాధించిన వారిలో బాలురే అధికం
54శాతం బాలురు.. 46 శాతం బాలికలు..
బాసర, ఆగస్టు 19 : బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాల ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లకు గాను 19,490 దరఖాస్తులు రాగా 1404 సీట్ల జాబితాను గురువారం ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు విడుదల చేశారు. మిగిలిన 96 సీట్లను క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ కేటగిరీలో త్వరలో భర్తీ చేయనున్నారు. సీట్లు సాధించిన వారిలో ఈ ఏడాది బాలురు అధిక శాతం ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ ఏడాది పాలిటెక్నిక్ ప్రవేశం పరీక్ష ద్వారా సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేశారు.
కౌన్సెలింగ్ తేదీలు ఇలా..
ఈ నెల 24న ఎన్ఆర్ఐ, గ్లోబల్ కేటగిరి(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కాకుండా) విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అలాగే 1404 సీట్లలో ఎంపికైన విద్యార్థులకు సెస్టెంబరు 1 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. సెప్టెంబరు క్రమ సంఖ్య 1 నుంచి 500 వరకు, సెప్టెంబరు 2న 501 నుంచి 1000 వరకు, సెప్టెంబరు 3న 1001 నుంచి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న క్యాప్, పీహెచ్ కేటగిరి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. అలాగే ఈ నెల 26న ఎన్సీసీ, స్పోర్ట్స్ అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలను పరిశీలించిన అనంతరం రెండవ దశ కౌన్సెలింగ్‌లో సెప్టెంబరు 8న ఎన్సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్‌లో ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అలాగే గ్లోబల్ కేటగిరిలో పూర్తి కాని సీట్లకు సెప్టెంబరు 4న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మొత్తం దరఖాస్తుల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి 11,215 దరఖాస్తులు రాగా, ప్రైవేటు పాఠశాలల నుంచి 8275 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తులు కేటగిరీల వారీగా..
19490 దరఖాస్తుల్లో కేటగిరీల వారీగా బీసీ(ఏ) కేటగిరీ నుంచి 1648, బీసీ(బీ) కేటగిరీ నుంచి 5186, బీసీ(సీ) కేటగిరీ నుంచి 70, బీసీ(డి) కేటగిరీ నుంచి 4095, బీసీ(ఈ) కేటగిరీ నుంచి 543, ఓసీ కేటగిరీ నుంచి 1636, ఎస్సీ కేటగిరీ నుంచి 3717, ఎస్టీ కేటగిరీ నుంచి 2595 దరఖాస్తులు వచ్చాయి.
కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు..
ట్రిపుల్‌ఐటీలో ఎంపికైన విద్యార్థుల కేటగిరి వారిగా కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి. బీసీ(ఏ) కేటగిరీ నుంచి బాలికలు, బాలురు 83, బీసీ(బీ) కేటగిరీ నుంచి బాలికలు, బాలురు 90, బీసీ(సీ) కేటగిరీ నుంచి బాలికలు, బాలురు 71, బీసీ(డి) కేటగిరీ నుంచి బాలికలు, బాలురు 90.8, బీసీ(ఈ) కేటగిరీ నుంచి బాలికలు 80, బాలురు 81, ఓసీ కేటగిరీ నుంచి బాలికలు, బాలురు 94.8, ఎస్సీ కేటగిరీ నుంచి బాలికలు, బాలురు 75, ఎస్టీ కేటగిరీ నుంచి బాలికలు 79, బాలురు 82.8 విధంగా ఉన్నాయి.
కేటగిరీల వారీగా సాధించిన సీట్లు…
1404 సీట్టలో కేటగిరిల వారీగా సాధించిన సీట్లు ఇలా ఉన్నాయి. ఓసీ నుంచి 179, బీసీ(ఏ) 128, బీసీ(బి) 421, బీసీ(సీ) 14, బీసీ(డి) 267, బీసీ(ఈ) 75, ఎస్సీ 219, ఎస్టీ 101గా ఉన్నాయి.
జిల్లాల వారీగా సాధించిన సీట్లు…
మేడ్చల్ 100, వరంగల్ అర్బన్ 86, నిజామాబాద్ 84, కరీంనగర్ 83, రంగారెడ్డి 78, నల్గొండ 66, ఖమ్మం 58, జగిత్యాల 57, మంచిర్యాల 57, సూర్యాపేట్ 56, భద్రాద్రి కొత్తగూడెం 54, పెద్దపల్లి 52, సిద్దిపేట్ 50, నిర్మల్ 42, వరంగల్ రూరల్(హన్మకొండ) 37, కామారెడ్డి 36, హైదరాబాద్ 34, రాజన్న సిరిసిల్ల 33, మహబూబ్‌నగర్ 32, సంగారెడ్డి 31, ఆదిలాబాద్ 29, యాదాద్రి భువనగిరి 29, మహబూబాబాద్ 28, నాగర్‌కర్నూల్ 28, కుమ్రంభీం ఆసిఫాబాద్ 27, వనపర్తి 24, జనగాం 21, జయశంకర్ భూపాలపల్లి 18, జోగులాంబ గద్వాల్ 17, మెదక్ 16, నారాయణ్‌పేట్ 10, వికారాబాద్ 10, ములుగు 5 , ఓపెన్ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 16 సీట్లు కేటాయించారు.
ప్రైవేట్ పాఠశాలలకే అధికం..
ప్రతి ఏడాది బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో 99 శాతం ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే సీట్లు సాధించే వారు. ఈ ఏడాది కరోనా కారణంగా ట్రిపుల్ఐటీ అధికారులు పాలిసెట్ ప్రవేశాల మార్కులతో ఎంపిక చేయగా అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్థులు సీట్లు సాధించారు. మొత్తం 1404 సీట్లలో 766 సీట్లు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, 638 సీట్లకు ప్రభు త్వ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. మొత్తం సీట్లలో బాలురు 54శాతం , బాలికలు 46శాతం సీట్లు సాధించారు. మొత్తానికి 54.5శాతం ప్రైవేటు విద్యార్థులు సీట్లు సాధించగా, 45.5 శాతం ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు సీట్లు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రాజేశ్వర్‌రావు, అడ్మిషన్ కన్వీనర్ కృష్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రంజిత్, డీన్లు దేవరాజ్, శేఖర్ శీలం, సతీశ్, వినోద్, సృజన, శిరీష, శ్వేత, బద్రి, సంతోష్, అడ్మిషన్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.