ఆసిఫాబాద్ టౌన్/పెంచికల్పేట్, మే 23 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఈ నెల 15న విద్యుత్ తీగలు అమర్చి పులిని హతమార్చిన కేసులు 16 మందిని రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ తెలిపారు. పెంచికలపేట రేంజ్ పరిధిలో కే-8 పులిని కొంతమంది వేటగాళ్లు చంపి పాతి పెట్టగా, అనుమానితుడైన ఎల్లూరు గ్రామానికి చెందిన అపాచీ శ్రీనివాస్(ఏ1)ను అదుపులోకి తీసుకొని విచారించారు.
ఆ తర్వాత మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని సిర్పూర్ కోర్టు ప్రస్తుత ఇన్చార్జి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి ఎదుట శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. అప్పాజీ శ్రీనివాస్, అప్పాజీ వెంకటేశ్, ఎలర్ శేఖర్, రోహిణి శ్రావణ్, చాపిడే అశోక్, చాపిడే పవన్‌కుమార్, ఎలరి ప్రకాశ్, బుర్రి వెంకటేశ్, కాటేల సాగర్, నికాడి వెంకటేశ్, లాటూకరి శ్రీనివాస్, భీంకరి వెంకటేశ్, బింకరి రంగయ్య, లేగల గోపాల్, రాచకొండ లచ్చయ్య, ఓండ్రె సంతోష్‌లను ఆసిఫాబాద్ సబ్ జైలులో అప్పగించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరో 14 మందిని అదుపులో ఉంచుకొని విచారణ కొనసాగిస్తున్నారని, వారికి కూడా త్వరలోనే రిమాండ్‌కు తరలించేఅవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు.