ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్టు ( Pokers Arrest ) చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Mahajan ) ఆదేశాల మేరకు, శనివారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మినీ బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 15 మందిని పట్టుకున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్ వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి పేకాట ముక్కలు, రూ 89,160 నగదు, 13 మొబైల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు, యువత అసాంఘిక కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక పనులకు, వ్యసనాలకు పాల్పడవద్దని సూచించారు.