పార్టీలో యువతకు పెద్దపీట
అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు
పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి మూల విజయారెడ్డి
కాగజ్‌నగర్‌లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం
హాజరైన జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనప్ప,
ఆత్రం సక్కు, రాష్ట్ర నాయకుడు అరిగెల టీఆర్ఎస్లో చేరిన 2 వేల మంది
కాగజ్‌నగర్ రూరల్/ ఆసిఫాబాద్, సెప్టెంబర్ 12:తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి మూల విజయారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధ్యక్షతన సిర్పూర్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించగా, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రాష్ట్ర నాయకుడు అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ పార్టీగా ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకుసాగుతుందన్నారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ పార్టీ పునర్నిర్మాణంలో పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామ కమిటీల ఎన్నికల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు 50 శాతంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి గూటికి చేరుతున్నాయన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు.
పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. అనంతరం రాష్ట్ర నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఇటీవల దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ పథకంతో జిల్లాలోని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో సాగునీటి సమస్య పరిష్కారమైందని తెలిపారు. నియోజకవర్గంలో 300 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించామని, రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన వృద్ధాప్య పింఛన్‌తో ప్రతిగ్రామంలో సుమారు 200 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నియోజకవర్గంలో 12 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేయించి, నిర్మాణం పూర్తి చేసినట్లు వెల్లడించారు. కౌటాల, చింతలమానేపల్లి మండలాలకు విద్యుత్ సమస్య పరిష్కారానికి 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రూ.58 కోట్లతో మంజూరుకు కృషి చేశామని, త్వరలోనే టెండర్లు ప్రారంభవుతాయని చెప్పారు. దీంతో బెజ్జూరు, కౌటాల, చింతలమానెపల్లి మండలాల విద్యుత్ సమస్య తీరుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వాగులపై 37 బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు. అనంతరం వివిధ మండలాలకు చెందిన 2 వేల మందికి టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీశ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, కార్యకర్తలున్నారు.
తెలంగాణ భవన్ సందర్శన
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్(తెలంగాణ)భవనాన్ని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి మూల విజయారెడ్డి సందర్శించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ భవనాలను నిర్మించడం ద్వారా పార్టీ కార్యకర్తలకు సమావేశాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో కష్టాలు పడ్డ కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని కొనియాడారు. వచ్చే నెలలో టీఆర్ఎస్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఆమె వెంట జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, మాజీ ఎంపీపీ బొమ్మెన బాలేశ్వర్‌గౌడ్, నాయకులు ఆత్రం వినోద్, సాలం, జలింషా, తెలంగరావు, మోహన్ తదితరులున్నారు.