
ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కుభీర్, జనవరి 12 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. కుభీర్ మండలంలోని రంగశివుని గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. అంతకుముందు రంగశివుని తండాలో రూ. 2లక్షలు, చాతలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి, ఈజీఎస్ నిధులు రూ.16లక్షలతో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగశివునితండాలో రూ.2కోట్లతో చాత నుంచి రోడ్డు సౌకర్యం కల్పించామని అన్నారు. శివాలయం నిర్మాణానికి రూ.15లక్షల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. సర్పంచ్ జాదవ్ దత్తురాం కష్టపడి గ్రామాన్ని రోల్ మోడల్‌గా తయారు చేశారని కొనియాడారు. పల్లె ప్రకృతి వనాన్ని తన సొంత ఖర్చులతో జిల్లాలోనే ప్రథమంగా నిలిపారన్నారు. పంచాయతీ నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాత దత్తురాం పటేల్‌ను గ్రామస్తులు మరిచి పోలేరని ప్రశంసించారు. హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి నిధులు, 30 డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ షాపు, హల్ద మీదుగా కొత్త రోడ్డు నిర్మాణం, గ్రామంలో హైమాస్ లైట్ల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ దత్తురాం పటేల్, మహిళా సంఘాల నాయకులు, గ్రామస్తులు వేర్వేరుగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ తూం లక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, వైస్ చైర్మన్ జాదవ్ దిగంబర్ పటేల్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, బొప్ప నాగలింగం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుభీర్ మార్కెట్ అభివృద్ధికి కోటీ 20 లక్షలు
కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ నల్ల చట్టాలు రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీలు పూర్తిగా నిర్వీర్యమయ్యేవని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ రైతు దీక్షతో మోదీ ప్రభుత్వం దిగి వచ్చి చట్టాలను ఉపసంహరించుకోవడం హర్షించదగినదన్నారు. కుభీర్‌లోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి రూ. కోటీ 20లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. కస్ర ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.32లక్షలు మంజూరు కాగా వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. గజమాల, శాలువాతో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని సన్మానించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి చైర్మన్, పాలకవర్గ సభ్యులు, కస్ర గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ దిగంబర పటేల్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.