
నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి
లక్ష్మణచాంద, జనవరి 12 : విద్యార్థులకు సేవలందించడంలో వరల్డ్ విజన్ పాత్ర ప్రశంసనీయమని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వడ్యాల్ గ్రామంలో వరల్డ్ విజన్ సంస్థ యూనిసెఫ్ సహకారంతో ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకోవడానికి అవసరమైన కులాయి నీటి ట్యాంకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మండలంలోని వడ్యాల్, లక్ష్మణచాంద, బాబాపూర్, చామన్పెల్లి, మల్లాపూర్, పీచర ఉన్నత పాఠశాలలతో పాటు వడ్యాల్ గ్రామంలోని రెండు అంగన్వాడీలు, కనకాపూర్ అంగన్వాడీ కేంద్రానికి వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ నీటి కులాయి ట్యాంకులను అందజేయడాన్ని ప్రశంసించారు. రూ.3 లక్షలతో విద్యార్థుల సౌకర్యంకోసం అందజేయడానికి ముందుకురావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి గ్రామ పంచాయతీలు, వీడీసీలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, సర్పంచ్ అట్ల లలి, మండల ఉపాధ్యక్షురాలు కల్పనా రాంరెడ్డి, ఉప సర్పంచ్ మోహన్, నాయకులు అడ్వాల రమేశ్, అట్ల రాంరెడ్డి, మండల విద్యాధికారి మధుసూదన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎమ్మార్సీ సుధాకర్ పాల్గొన్నారు.