
తాజాగా జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం
ఇటీవల మంత్రులు గంగుల,కొప్పుల చేతుల మీదుగా ఎన్సీడీసీ అవార్డు
ముథోల్, జనవరి 12 : ముథోల్ మండల సమాఖ్య అంచెలంచెలుగా ఎదిగి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఆదర్శంగా నిలుస్తున్నది. ఇటీవల నేషనల్ కో ఆపరేటీవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడేళ్ల ప్రాతిపాదికన ఉత్తమ పనితీరు కనబరిచిన సంఘాల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, ఈ సమాఖ్య జాతీయ స్థాయిలో మహిళా విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ, పనితీరును పరిగణంలోకి తీసుకొని అవార్డు ప్రకటించగా, ఇటీవల మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా సభ్యులు అందుకున్నారు.
ముథోల్ మండల సమాఖ్య మొదట 412 గ్రూపులతో ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 798 గ్రూపులు, 8,804 మంది సభ్యులతో కొనసాగుతుంది. స్త్రీనిధి బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకోవడంలో ఈ సమాఖ్య ముందంజలో ఉంది. సకాలంలో బకాయిలు చెల్లిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలుస్తున్నది. 2016-17లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం, 2018-19లో జిల్లా స్థాయిలో ప్రథమ, 2020-21లో ద్వితీయ స్థానాల్లో నిలిచింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందుకుంది. గతేడాది డిసెంబర్ 21న నేషనల్ కో ఆపరేటీవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాతీయ స్థాయి పోటీల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో ముథోల్ మండల సమాఖ్య జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. డిసెంబర్ 28న కరీంనగర్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా పురస్కారాన్ని సభ్యులు అందుకున్నారు. అనేక పురస్కారాలు అందుకున్న ఈ సమాఖ్యను ప్రతి సంఘం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్సీడీసీ పురస్కారం అందుకోవడంపై సభ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పనిచేశాం
సమాఖ్యలోని సభ్యులమంతా కష్టపడి పనిచేసినందుకే గుర్తింపు వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. అధికారుల సహాయ సహకారాలతో, రుణాల చెల్లింపులు సక్రమంగా నిర్వహిస్తున్నాం. చెల్లింపులపై సంఘాల సభ్యులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తుండడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. – నాగమణి, మండల సమాఖ్య సభ్యురాలు
ప్రతి సభ్యురాలికీ ధన్యవాదాలు
ప్రతి సంఘం సభ్యురాలికీ రుణాలపై అవగాహన కల్పిస్తున్నాం. రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ పురస్కారాల ఎంపికకు సహకరించిన ప్రతి సంఘం సభ్యురాలికీ ధన్యవాదాలు. – అశోక్, ఏపీఎం