
ఇంద్రవెల్లి, జనవరి 12 : నాగోబాకు నిర్వహించే మహాపూజలకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి హస్తలమడుగులోని గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బుధవారం సాయంత్రం కెస్లాపూర్ నుంచి బయల్దేరారు. కెస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయం(మురాడి)లో సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు మధ్యా హ్నం కెస్లాపూర్ గ్రామంలోని పు రాతన నాగోబా ఆలయానికి చేరుకున్నారు. పురాతన నాగోబా ఆలయ ఆవరణలో ప్రత్యేక సమావేశమై నాగోబాకు నిర్వహించే మహాపూజలతో పాటు గంగాజలం సేకరణకు వెళ్తున్న మార్గాలపై చర్చించారు. అనంతరం వారి సంప్రదాయం ప్రకారం పురాతన ఆలయం(మురాడి)లో ప్రత్యేక పూజలు చేశారు. భద్రపర్చిన గంగాజల ఝరిని కటోడ కోసురావ్, ధర్ము, హనుమంత్‌రావ్ బయటకు తీశారు. ఆలయం పక్కన తెల్లవస్త్రంపై ఝరిని పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఝరిని కటోడ కోసురావ్ వీపుపై కట్టారు. కోసురావ్తోపాటు వందమంది మెస్రం వంశీయులు గిరిజన సంప్రదాయం ప్రకారం మర్యదపూర్వకంగా ఒకరికొకరు కలుసుకున్నారు. గ్రామం నుంచి పొలిమేర వరకు గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు వారిని సంప్రదాయంగా సాగనంపారు.
పాదయాత్ర విశేషాలు..
కెస్లాపూర్ నుంచి ప్రారంభమైన గంగాజల సేకరణ పాదయాత్ర మండలంలోని కెస్లాగూడ(జీ)గ్రామానికి చేరుకంటుంది. రాత్రి అక్కడే బసచేశారు.13న మండలంలోని వడగాం చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 14న ఉట్నూర్ మండలంలోని సాలేవాడకు, 15న తేజాపూర్‌కు, 16న కడెం మండలంలోని ఉడుంపూర్, 17న జన్నారం మండలం మల్లాపూర్, 18న జన్నారం మండలంలోని గోదావరికి ప్రత్యేక పూజలు చేసి, హస్తలమడుగు నుంచి పవిత్ర గంగాజలం సేకరిస్తారు. తిరుగు ప్రయాణంలో 19న ఉట్నూర్, 20న ఉట్నూర్ మండలం నర్సపూర్, 21న ఇంద్రవెల్లి మండలం దోడంద చేరుకుంటారు. 22, 23, 24, 25వ తేదీ వరకు అక్కడే బస చేస్తారు. 26న దోడంద నుంచి బయలుదేరి మార్గమధ్యంలో ఎక్కడైనా నిలకడ చేస్తారు. 27న ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం కెస్లాపూర్ మర్రిచెట్లకు చేరుకుంటారు. మూడు రోజులు అక్కడే బసచేస్తారు. 31న అర్ధరాత్రి నాగోబాకు గంగాజలంతో మహాపూజలు నిర్వహించనున్నారు. పాదయాత్రలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం వంశీయులు చిన్నుపటేల్, బాధిరావ్‌పటేల్, లింబారావ్, కటోడ కోసురావ్, పర్ధాంజీ దాదారావ్, హనుమంత్‌రావ్, కోశరావ్, పాండురంగ్, మెస్రం మనోహర్, కోశరావ్, నాగోరావ్, గణపతి, తిరుపతి, సోనేరావ్, దేవ్‌రావ్, నాగ్నాథ్, తుకారామ్, శేఖర్‌బాబు, ఆనంద్‌రావ్, సితారామ్, ధర్ము, కార్తీక్ పాల్గొన్నారు.