
ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
బూస్టర్ డోసు ప్రారంభం
ఎదులాపురం, జనవరి 12 : ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో పోలీసుల పాత్ర కీలకమైనదని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో భాగంగా ఆదిలాబాద్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బూస్టర్ డోస్ క్యాంపును ప్రారంభించారు. డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ సహకారంతో మూడు రోజులు క్యాంపు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 500 మంది పోలీసులకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తప్పని సరిగా మాస్కు ధరించి ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు. ఎస్ శ్రీనివాస్‌రావు, బీ వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఎం విజయ్ కుమార్, సీఐ పీ శ్రీనివాస్ , ఆర్ఐలు డీ వెంకటి జీ వేణు, శ్రీపాల్, వంశీకృష్ణ, ఖుర్షీద్‌నగర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ శిల్ప, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై నజర్
చిరువ్యాపారులు, ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకొని అధిక వడ్డీ డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అధిక వడ్డీలు కట్టలేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారని వారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా పోలీస్ శాఖ అప్రమత్తమైందని పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, అధిక వడ్డీ వ్యాపారాలు, బెట్టింగ్, అక్రమ ఫైనాన్స్ చేసే వ్యాపారులపై నజర్ ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. వడ్డీ వ్యాపారులు ఎవరైనా బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని వడ్డీ గురించి వేధించిన, అధిక వసూలకు యత్నించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజిస్టర్ చిట్టిలు కాకుండా జీరో చిట్టి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇలాంటి వ్యాపారుల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతాయని వారిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఎలాంటి సమాచారాన్ని అయినా నేరుగా 100 డయల్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
రాత పరీక్ష ఫలితాలు వెల్లడి
పోలీస్ శిక్షణకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా యువతీ యువకులు పోలీసు ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పోలీసు యంత్రాంగం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తుందన్నారు. 2021 డిసెంబర్ 26వ తేదీన రాసిన పరీక్షలో అర్హత సాధించిన 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో శిక్షణ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమవుతుందన్నారు. త్వరలో తదుపరి వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డ్‌పై ఉం టుందని అభ్యర్థులు తమకు వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. లేనిచో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అందుబాటులో ఉంటుందన్నారు.
సిరికొండ పోలీస్ స్టేషన్ తనిఖీ
సిరికొండ, జనవరి 12 :సిరికొండ పోలీస్ స్టేషన్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. కేసుల వివరాలు, సమస్యలు పోలీసులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రత, కొవిడ్ నిబంధనల గురించి వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఇచ్చోడ సీఐ రమేశ్ బాబు, సిరికొండ ఎస్ఐ సందీప్, కానిస్టేబుళ్లు ఉన్నారు.